మేడ్చల్, మే 9 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య త్రీవమైన దృష్ట్యా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా భావిస్తూ వాటర్ ట్యాంకర్ల యజమానులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఎండలు ముదరకముందు 5,500 లీటర్ల వాటర్ ట్యాంక్‌కు రూ.500 ఉండగా ఇప్పుడు అదే వాటర్ ట్యాంక్‌కు రూ.600 నుంచి రూ.800 వరకు తీసుకుంటున్నారు. డిమాండ్‌ను బట్టి మరింత పెంచుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికను రూపొందించి తాగునీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఎండలు త్రీవమైన నేపథ్యంలో బోర్లు ఎత్తిపోవడంతో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్యను ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని శివారు ప్రాంతాల్లో మిషన్ భగీరధ ద్వారా ప్రతి రోజు మంచినీటిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందిస్తే ఇప్పుడు నాలుగు రోజులకోసారైన నీటి సరఫరా జరగడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
మరింత లోతుకు భూగర్భ జలాలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లడంతో నీటి ఎద్దడి త్రీవమైంది. రోజురోజుకు భూగర్భ జలాల మట్టం పడిపోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరిలో 9.96 మీటర్ల లోతులో ఉండగా మార్చిలో 10.78 మీటర్లు ఏప్రిల్‌లో 12.08 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మేడిపల్లి మండలంలో అత్యధికంగా 20.68 మీటర్ల లోతుకు పడిపోగా కూకట్పల్లి మండలంలో 19.34 మీటర్లు, మల్కాజిగిరి మండలంలో 17.83, దుండిగల్ మైసమ్మ మండలంలో 19.34 మీటర్ల లోతుకు పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా మండలాలైన శామీర్‌పేట్, కీసర, కాప్రా, కుత్బుల్లాపూర్, బాచ్‌పల్లి, ఉప్పల్, బాలనగర్ తదితర మండలాల్లో 10 మీటర్ల లోతుకు పడిపోయాయి.
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు అడ్డుకట్ట వేయరా?
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల దోపిడిని అరికట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు చేస్తున్నారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ఇష్ట రీతిలో వాటర్ ట్యాంకర్ల ధరలను పెంచుతుంటే అధికారులు ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లను నియంత్రించలేని అధికారులు మున్సిపాలిటీల ఆధ్వర్యంలోనైనా నీటి సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు సిండికేట్‌గా మారి దోపిడికి పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.