సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రోగుల సౌకర్యార్థం నగరంలోని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేసిన ఈవినింగ్ ఓపీ సేవలు కనుమరుగైపోయాయి. ఉదయం సమయంలో రద్దీగా ఉండే ఓపీ వల్ల అటు వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరగడం, ఇటు రోగులు ఇబ్బందులకు గురవడం వంటి సమస్యలను అధిగమించేందుకు గత బీఆఎర్ఎస్ ప్రభుత్వం నగరంలోని అన్ని ప్రభుత్వ బోధన దవాఖానల్లో సాయంకాలం ఓపీ సేవలను 2022, జూలై 25 ప్రారంభించింది. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత స్టాఫ్ కొరత కారణంగా ఉదయం ఓపీనే నిర్వహణ భారమవుతుండడంతో ఈవినింగ్ ఔట్ పేషెంట్ సేవలను నిలిపివేశారు.
సాయంత్రం ఓపీ సేవలతో ఎంతో ఉపశమనం
ఉదయం.. సాయంత్రం రెండు పూటల అందించే ఓపీ సేవలతో రోగులకు ఎంతో ఉపశమనం కలిగింది. సాధారణంగా ఉదయం సమయంలో ఓపీ సేవల కోసం ఏ ప్రభుత్వ దవాఖానకు వెళ్లినా క్యూలో కనీసం గంట నుంచి రెండు గంటల పాటు నిరీక్షించాల్సిందే. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే, సుల్తాన్‌బజార్, పేట్లబుర్జ్ ప్రసూతి తదితర దవాఖానల్లో రోజురోజుకు ఓపీ సేవలకు రోగుల తాకిడి పెరుగుతుండడంతో ఉదయం సమయాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఓపీలో వైద్యులను సంప్రదించే సమయానికి ఆయా దవాఖానల్లో ఉన్న ల్యాబ్‌ల సమయం ముగిసిపోతున్నది. దీంతో ఓపీలో వైద్యులు రాసిన వైద్యపరీక్షల కోసం తిరిగి మరుసటి రోజు రావాల్సిన పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా ఈ రోజు వైద్యపరీక్షలకు నమూనాలు ఇస్తే మరుసటి రోజు నివేదికలు రావడం వల్ల ఆ రిపోర్ట్‌లను చూపించేందుకు మళ్లీ వారం తరువాత సంబంధిత యూనిట్ ఓపీకి మరోసారి రావాల్సి వస్తున్నది. ఇలా ఓపీ సేవలు, వైద్యపరీక్షల కోసం కనీసం రెండు మూడు రోజుల పాటు దవాఖానకు తిరగాల్సి రావడంతో పాటు ఓపీ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది.
ఈ క్రమంలో గర్భిణులు చిన్నపిల్లలు, బాలింతలు, వృద్ధులు పడుతున్న అవస్థలను గమనించిన అప్పటి కేసీఆర్ సర్కార్ నగరంలోని అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌లో సాయంకాలం ఓపీ సేవలను ప్రారంభించింది. దవాఖానల వారీగా కొన్ని రకాల స్పెషాలిటీ సేవలను ఈవినింగ్ క్లినిక్స్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా ఉస్మానియా దవాఖానలో జనరల్ మెడిసిన్, ఆర్థో, జనరల్ సర్జరీ సేవలు, గాంధీలో జనరల్ మెడిసిన్, ఆర్థో, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్, గైనకాలజీ సేవలు, నిలోఫర్‌లో పిడియాట్రిక్, గైనకాలజీ, ఎంఎన్జేలో మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, రేడియో అంకాలజీ, సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానలో గైనకాలజీ, ఆంటినేటల్, పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలో గైనకాలజీ, ఆంటినేటల్ సేవలను అందించారు.
రోజుల తరబడి తిరగాల్సి వస్తున్నది..
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత వైద్య ఆరోగ్యశాఖ రోజురోజుకు నీరుగారిపోతోంది. క్రమంగా మెరుగుపడాల్సిన సౌకర్యాలు, సేవలు మందగిస్తున్నాయి. సాయంకాలం ఓపీ వంటి సేవలు కనుమరుగవుతున్నాయి. వైద్యలు, నర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ, శానిటేషన్, సపోర్టింగ్ స్టాఫ్ కొరత కారణంగా ఉదయం ఓపీనే నిర్వహణ భారమవుతుండడంతో ఈవినింగ్ ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఒక్క నిమ్స్ హాస్పిటల్లో పెయిడ్ ఓపీ మినహా ఇతర ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో సాయంకాలం ఓపీ సేవలు అందడం లేదంటున్నారు రోగులు. ఫలితంగా ఏదైనా ఒక సమస్య కోసం దాదాపు వారం రోజుల పాటు దవాఖాన చుట్టూ తిరగాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.
ఓపీ సేవలు పొందే సమయానికి ల్యాబ్‌లు, ఎక్స్‌రే, స్కానింగ్ వంటి వాటి సమయం ముగుస్తోందని, వాటి కోసం మరుసటి రోజు లేదా వారు అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు రావల్సి వస్తుందని, ఈ క్రమంలో డాక్టర్ కన్సల్టేషన్ కోసం ఒక రోజు, వైద్య పరీక్షల కోసం మరో రోజు, రిపోర్టుల కోసం ఒక రోజు, వాటిని సబంధిత యూనిట్ వైద్యుడికి చూపించడం కోసం మరో రోజు ఇలా దాదాపు వారం రోజులు దవాఖానల చుట్టూ తిరగాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవినింగ్ క్లినిక్స్ అందుబాటులో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు దాదాపు లేవని రోగులు చెబుతున్నారు. అంతే కాకుండా పొద్దంతా పనులు చేసుకుని జీవించే రోజువారీ కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులకు సాయంకాలం ఓపీ సేవలు ఎంతో ఉపశమనం కలిగించేవంటున్నారు.