కంటోన్మెంట్, ఆగస్టు 10: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటి ఆస్పత్రి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసుల నుంచి కోరుతూ ఈడీ లేఖ రాసింది. ఈ కేసులో ఉన్న కీలక అంశాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఈడీ దూకుడు పెంచింది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో డాక్టర్ నమ్రత ప్రధాన నిందితురాలిగా తేలడంతో పాటు మొత్తం 86 మంది పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు స్పష్టం అయింది. సరోగసి పేరుతో అక్రమంగా పిల్లల వ్యాపారం కూడా చేసినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది.
విచారణలో భాగంగా సుమారు రూ. 40 కోట్ల మేరకు హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం రావడంతో ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు.
చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఆమె కోట్లు సంపాదించినట్లు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం విజయవాడ పోలీసులు నవజాత శిశువును అమ్ముతున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో అజిత్ సింగ్ నగర్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ గ్యాంగ్ హైదరాబాద్నుంచే పనిచేస్తున్నట్లు నిగ్గు తేల్చారు. పిల్లలను అమ్మే గ్యాంగులు విజయవాడలో మూడు, నాలుగు ఉన్నాయని, ఈ గ్యాంగులతో సృష్టికి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆ గ్యాంగ్ హైదరాబాద్‌లోని సృష్టి ఆఫీస్‌కు, విజయవాడ బ్రాంచ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 30 మంది అరెస్ట్…
సృష్టి ఫెర్టిలిటి ఆస్పత్రి కేసులో ఇప్పటికే 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల విక్రయాల్లో దళారులుగా వ్యవహరించిన ముగ్గురిని ఇటీవల విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిరుపేదల కుటుంబాలను టార్గెట్ చేసుకుని వారి నుంచి పిల్లలను కొన్న వ్యవహారంలో వీరు అరెస్టయ్యారు. వీరితో డాక్టర్ నమ్రతకు సంబంధాలు ఉండటంతో పాటు వీరి ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దీంతో పాటు విశాఖపట్నం కేజీహెచ్‌లో వైద్యులు వ్యవహరించినట్టే విజయవాడలోని కొంతమంది ప్రైవేట్ వైద్యులు కూడా వ్యవహరించినట్లు తెలిసింది. ఆంధ్రా వైద్య కళాశాలలో తనతో పాటు వైద్యవిద్యను అభ్యసించి వేర్వేరు ప్రదేశాల్లో ఆస్పత్రులు నిర్వహిస్తున్న వైద్యులను ఒక టీమ్‌గా డాక్టర్ నమ్రత ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నంలో వైద్యులు, దళారులు పోలీసులకు చిక్కడంతో నమ్రతతో సంబంధం నడిపిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు సమాచారం.ప్రధానంగా ఏపీలోని ఉమ్మడి కృష్ణాజిల్లాల్లోని వెనుకబడిన తండాలను టార్గెట్‌గా చేసుకుని వ్యవహారాలు నడిపినట్టు పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.