సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతపై పోలీసులు దృష్టి పెట్టారు. మరో వైపు పోలింగ్ ‘డే’ రోజు ఓల్డ్‌సిటీలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ఆయా ఘటనలకు సంబంధించి అక్కడక్కడ కేసులు నమోదయ్యాయి. మంగళ్‌హాట్ ఠాణా వద్ద బీజేపీ కార్యకర్తలు డమ్మీ ఈవీఎంతో రాకేశ్ గౌడ్, బంటీ ప్రచారం చేస్తుండటంతో వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి ఠాణాకు తరలించారు. అయితే ఠాణాలో ఉన్న వారిని విడిపించేందుకు బీజీపీ అభ్యర్థి మాధవీలత వెళ్లింది. అక్కడ పోలీసుల విధులకు ఆటంకం కల్గించి తమ అనుచరులిద్దరిని తీసుకొని, పోలీసులు స్వాధీనం చేసుకున్న డమ్మీ ఈవీఎంను కూడా తీసుకెళ్లిందని మరో కేసు నమోదు చేశారు. అలాగే సంతోష్‌నగర్‌లో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు వారి వారి కార్యకర్తలు, నాయకులతో కలిసి పర్యటించారు. రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక చోట ఎదురు పడినప్పుడు ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతూ వచ్చారు. ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళల బుర్కా(హిజాబు)ను తీసి మాధవీలత నిబంధనలు ఉల్లంఘించారని కేసు, మధురానగర్ ఠాణాలోనూ బీజేపీ సోషల్‌మీడియా కోఆర్డినేటర్‌పై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తుండటంతో ఓల్డ్‌సిటీలో మరో ఠాణాలో ఎంఐఎం నాయకులపై కూడా కేసు నమోదు చేశారు. ఇలా ఓల్డ్‌సిటీలో ఒకరిపై ఒకరి ఆరోపణలు, ఎన్నికల అధికారుల ఫిర్యాదులతో ఆయా ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి.
నగర పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన 13 లొకేషన్లలో 16 స్ట్రాంగ్ రూమ్లున్నాయి. జూన్ 4 వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లో ఉండనున్నాయి. ఇక్కడున్న భద్రతను పోలీస్ ఉన్నతాధికారులతో పాటు జిల్లా ఎన్నికల అధికారులు, పరిశీలకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. మూడంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాలతో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిఘాను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.