సిటీబ్యూరో, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం బుధవారం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 88,73,991 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 45,88,976 ఉన్నారు.
మహిళలు 42,82,795 ఉండగా, ఇతరులు 2220 మంది ఉన్నారు. అత్యధికంగా శేరి లింగంపల్లిలో 6,98,133, రెండో స్థానంలో ఎల్బీనగర్ 5,66,866, ఆ తర్వాత స్థానంలో రాజేంద్రనగర్ 5,52,455, మహేశ్వరం 5,17,316, ఉప్పల్లో 5,10,345 ఓటర్లతో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. చార్మినార్లో 2,24,074 ఓటర్లతో అత్యల్పంగా నిలిచింది. సనత్నగర్లో 2,44,956, కంటోన్మెంట్ 2,46,622, సికింద్రాబాద్లో 2,56,577, అంబర్పేట 2,70,750 ఓటర్లతో అత్యల్పంగా నియోజకవర్గాలు నమోదు అయ్యాయి.
ఓటరు జాబితా సరిచూసుకోండి
గ్రేటర్లో వెల్లడించిన తుది ఓటరు జాబితాలో పేర్లు, వివరాలను సరిచూసుకోవాలని గ్రేటర్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సూచించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈఆర్వో ఆఫీసులు, ఈసీఐ వెబ్సైట్, https://voters.eci.gov.in, www.ceotelangana.nic.in లేదా voters helpline app ద్వారా అభ్యంతరాలను సమర్పించవచ్చన్నారు. ఫారం-6. ఫారం-7, ఫారం-8 ద్వారా సవరించుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్లో సంప్రదించాలని సూచించారు.