బంజారాహిల్స్,ఆగస్టు 19: ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో స్వచ్ఛంద సంస్థ కార్యాలయానికి చెందిన ఇంట్లో 44 ఓట్లు ఉన్న విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బూత్ నంబర్ 237లో 8-2-684/250 నంబర్ గల ఇంటి నంబర్ మీద 44 మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా జాబితాలో ప్రచురించారు. 237 పోలింగ్ బూత్‌లోని 447 క్రమ సంఖ్య నుంచి 489 నంబర్ దాకా ఉన్న ఓటర్లలో ఐదారు మంది తప్ప మిగిలిన వారు మొత్తం సమీపంలోని మరో చోట నివాసం ఉంటున్నట్లు గుర్తించిన స్థానిక రాజకీయ పార్టీల కార్యకర్తలు, బీఎల్ఏలు ఫిర్యాదులు చేశారు.
ఈ వ్యవహారంపై నమస్తే తెలంగాణ పత్రికలో కథనం ప్రచురించడంతో సమగ్రమైన విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఖైరతాబాద్ నియోజకవర్గం ఈఆర్వోగా వ్యవహరిస్తున్న శంకర్‌ను జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. దీంతో బుధవారం స్థానిక బీఎల్వోలు, ఏఈఆర్వో కైలాశ్ తదితరులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే కాలనీ ఇంటి చిరునామాతో ఉన్న ఓటర్లలతో కొంతమంది బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఓ ఆధ్యాత్మిక సంస్థలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే క్వార్టర్స్‌లో ఉంటారని స్థానికులు తెలిపారు. దాంతో ఎన్నికల అధికారులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు.
కాగా ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ దరఖాస్తులను నేరుగా ఓటర్లకు, వారి కుటుంబసభ్యులకు మాత్రమే ఇవ్వడంతో పాటు వారి ఇంటికి వెళ్లి ఫారమ్స్ సేకరించాలని ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ఉండగా వాటిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 44 మంది ఓటర్లు నివాసం ఉంటున్నట్లు చూపించిన భవనం వద్దకు జాతీయ మీడియాతో ఇతర మీడియా ప్రతినిధులు వెళ్లి వాకబు చేయగా 44 మందిలో ఐదారు మంది మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నారని, మిగిలిన వారంతా రోడ్ నం. 12లోని వెంగళ్రావు బిల్డింగ్ వెనకాల ఉన్న ఆధ్మాత్మిక సంస్థకు చెందిన క్వార్టర్స్‌లో ఉంటున్నట్లు తేలింది. గతంలో ఈ ఇంటి నంబర్ మీద సుమారు 80 మంది దాకా ఓటర్లు ఉన్నారని, వారిలో చాలా మంది ప్రస్తుతం లేరని తేలింది.
అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ చిరునామాలో లేనివారి ఓటర్లను షిఫ్టెడ్ కేటగిరీలో తొలగించాల్సిన ఎన్నికల అధికారులు ఆపని చేయకుండా 44మందిని మొత్తం ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చడం గమనార్హం. ఇదిలా ఉండగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముసాయిదా జాబితాలో ఓటర్లుగా పేర్కొన్న వారిలో 42,575 మంది ఓటర్లు 2002 మ్యాపింగ్ వివరాలు దరఖాస్తు ఫారమ్స్‌లో నింపలేదని నియోజకవర్గం ఎన్నికల అధికారి శంకర్ తెలిపారు. వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని, 2002లో వారు ఎక్కడ ఓటు వేశారు.. వారి కుటుంబసభ్యులు ఎవరనే విషయాన్ని చెప్పడంతో పాటు ప్రస్తుతం నివాసం ఉంటున్న చిరునామాను ధ్రువీకరిస్తూ ఎన్నికల సంఘం అనుమతించిన 12 పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం మీద కోట్లాది రూపాయల వ్యయంతో ఎన్నికల సంఘం చేపట్టిన కసరత్తు క్షేత్రస్థాయిలో సరైన రీతిలో జరగలేదనే విషయాన్ని ఎమ్మెల్యే కాలనీలో 44 ఓటర్ల వ్యవహారం బయటపెట్టిందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.