అమీర్‌పేట్ : ఏడేండ్ల తన పదవీ కాలంలో రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర విభజన అంశాలను బీజేపీ తెరపైకి తెచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. విభజన అంశానికి సంబంధించి పార్లమెంట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సనత్‌నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి తలసాని ఆధ్వర్యంలో పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు.
సికింద్రాబాద్ ఎం.జి రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నిరసన ప్రదర్శనలో నల్ల కండువాలు ధరించిన పార్టీ శ్రేణులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చేకూరిన ప్రయోజనాలేమీ లేదన్నారు.
సింగరేణిని తెలంగాణ హక్కుగా అభివర్ణిస్తూ, ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థను అమ్మకానికి పెడుతూ బీజేపీ పావులు కదుపుతోందని, అదే జరిగితే తెలంగాణ భగ్గుమంటుందని, బీజేపీ పతనం అక్కడి నుండే ప్రారంభమవుతుందన్నారు. నిరసన ప్రదర్శనలో భాగంగా టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ తలసాని సాయికిరణ్‌యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలను లక్ష్మిరెడ్డి, మహేశ్వరి శ్రీహరి. కూర్మ హేమలతతో పాటు మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.