సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): మాతా శిశు మరణాలను తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సూపర్ స్పెషాల్టీ మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్(ఎంసీహెచ్) నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన మూడు సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్స్‌లలో గాంధీలోని ఎంసీహెచ్ నిర్మాణ పనులు దాదాపు పూర్తై ప్రారంభానికి సిద్ధమైంది. ప్రసవం సమయంలో, ప్రసవం తరువాత మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పాటు పుట్టిన శిశువు ఆరోగ్య సంరక్షణ కోసం మల్టీ సూపర్ స్పెషాల్టీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఎంసీహెచ్ సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి ఎంసీహెచ్ సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మాణ పనులను గాంధీలో ప్రారంభించగా, రెండో ఎంసీహెచ్ హాస్పిటల్ నిర్మాణ పనులను నిమ్స్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక మూడో ఎంసీహెచ్ హాస్పిటల్‌ను అల్వాల్‌లో కొత్తగా నిర్మిస్తున్న టిమ్స్ ఆవరణలో నిర్మించనున్నారు.
రూ.100 కోట్లతో..
గాంధీ దవాఖానలో రూ.100 కోట్ల వ్యయంతో 200 పడకల సామర్ధ్యం గల సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నారు. ఎనిమిది అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ దవాఖానలో ప్రసవించిన మహిళలు, శిశువులకు సంబంధించిన అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో వెల్లడించారు. ప్రధానంగా గుండె సంబంధిత, కిడ్నీ, కాలేయం, న్యూరో తదితర మల్టిపుల్ వ్యాధులతో బాధపడే తల్లులకు, పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల సమస్యలతో బాధపడే శిశువులకు ఈ మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించనున్నారు.
300 నుంచి 500 పడకల వరకు..
ప్రస్తుతం గాంధీ దవాఖానలో 300 పడకల సామర్థ్యంతో ప్రసూతి విభాగం అందుబాటులో ఉంది. ఇందులో 200 పడకలు గర్భిణులు, స్త్రీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం కేటాయించగా, చిన్న పిల్లల కోసం మరో 100 పడకలు ఉన్నాయి. అయితే, గాంధీ దవాఖానకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోగుల తాకిడి ఉంటుంది. కొత్తగా అందుబాటులోకి రానున్న 200 పడకల సామర్థ్యం గల ఎంసీహెచ్ సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్‌తో మాతా, శిశువులకు మరింత మెరుగైన వైద్యం అందనుందంటున్నారు వైద్యులు. ప్రస్తుతం దవాఖానలో మాతా, శిశువుల కోసం ఉన్న 300 పడకలకు తోడు 200 పడకలు అదనంగా రావడంతో మాతా శిశు సంరక్షణ పడకల సంఖ్య 500కు పెరగనుంది. మల్టిపుల్ సమస్యలతో బాధపడే మాతా శిశువులకు అవసరమైన సూపర్ స్పెషాలిటీ సేవలను గాంధీలోని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించనున్నారు.
అందుబాటులోకి రానున్న సేవలు..
గర్భిణులు, ప్రసవించిన తల్లుల కోసం మదర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎంఐసీయూ) మాడ్యులర్ లేబర్ రూమ్స్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే తల్లుల కోసం నెఫ్రాలజి, యూరాలజీ విభాగాలు ఉన్నాయి. ఇంకా గ్యాస్ట్రో విభాగం, కార్డియో విభాగం, న్యూరాలజీ విభాగం, జనరల్ మెడిసిన్, ఇతర విభాగాలు ఉన్నాయి.
ఈ నెలాఖరులో ప్రారంభించే అవకాశం..
గాంధీలో సూపర్ స్పెషాల్టీ ‘మదర్ అండ్ చైల్డ్’ భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఎనిమిది అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో మదర్ అండ్ చైల్డ్‌కు సంబంధించిన అన్ని రకాల సూపర్ స్పెషాల్టీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం, నిర్మాణ పనులను టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిర్మాణ పనులు దాదాపు పూర్తవడంతో మెడికల్ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేయడం, ఇతర క్లినికల్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. వారం పది రోజుల్లో ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇవి పూర్తైన వెంటనే మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ఎంసీహెచ్ హాస్పిటల్‌ను ప్రారంభించడం జరుగుతుంది. ఈ భవనం అందుబాటులోకి వస్తే చాలా మాతా శిశువులకు మరింత మెరుగైన వైద్యం అందించడమే కాకుండా ఎంఎంఆర్, ఐఎంఆర్‌ను మరింత తగ్గించవచ్చు.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన