సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా దొంగ ఓట్లు, రిగ్గింగ్‌కు పాల్పడింది. దర్జాగా దొంగ ఓట్లు వేసినా పట్టించుకోకుండా పట్టించిన బీఆర్ఎస్ నాయకులపైనే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ముందునుంచీ చెబుతున్నట్టే అధికారం అండతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తన అనుచరులు రౌడీయిజంతో ప్రలోభాలకు గురిచేయడం, దొంగ ఓట్లు, రిగ్గింగ్ చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించడాన్ని నిరసిస్తూ యూసుఫ్‌గూడలో బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీతా గోపీనాథ్, బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.
దొంగ ఓటర్లను అరెస్ట్ చేయాలంటూ పట్టుబట్టడంతో నవీన్‌యాదవ్ తండ్రి రౌడీషీటర్ చిన్న శ్రీశైలంయాదవ్ రౌడీమూకలతో చేరుకొని పోలీసుల ముందే బీఆర్ఎస్ నేతలపై దాడికి తెగబడ్డాడు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచే కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారం గంపగత్తుగా దొంగ ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించడం, సా యంత్రం పోలిస్ ముగిసే సమయానికి ఇతర ప్రాంతాల నుంచి రప్పించి మరీ ఓట్లు వేయించారు. కార్డు ఒకరిది.. ఓటు వేసేవాళ్లు ఇంకొకరు.. అలాగే ఓటు వేసిన వారు బయటకు వచ్చి తమ చేతికున్న ఇంకును తొలగించి మరో చోట ఓటు వేయడం ఇలా దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్చగా కొనసాగించారు. ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రౌడీయిజం ప్రదర్శించాడు.
మచ్చుకు కొన్ని ఘటనలు
యూసుఫ్‌గూడలోని బూత్ నెంబర్ 235, 240 వద్ద భారీ ఎత్తున దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన మహిళలను బీఆర్ఎస్ నాయకులు అడ్డగించారు. అమరావతి స్కూల్ వద్ద నకిలీ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. స్థానికేతరులకు ఇక్కడ ఓటరుగా నమోదు చేయించి, ఆయా ప్రాంతాల నుంచి వాళ్లను ఇక్కడికి కొందరిని రప్పించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
రిగ్గింగ్ రిగ్గింగ్ !
ఒక పక్క దొంగ ఓట్లతో వీరంగం చేసిన కాంగ్రెస్ నాయకులు, రిగ్గింగ్ సైతం యథేచ్చగా కొనసాగించారు. సాయంత్రం 4గంటల తర్వాత గుంపులు గుంపులుగా బోరబండ, షేక్‌పేట్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లోని దొంగ ఓటర్లను ఒకో బూత్ నుంచి మరో బూత్‌కు తిప్పారు. ఎన్నికల సమయం అరగంట ఉందనగానే పలు బూత్‌ల వద్దకు ఈ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ఓటర్లు క్యూలైన్లలో నిలబడ్డారు. సాయంత్రం 6గంటలకు పోలింగ్ సమయం పూర్తవడంతో పలు బూత్‌లలో కాంగ్రెస్ సానుభూతిపరులు పోలింగ్ బూత్ లోపలే ఉన్నారు. లోపల ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అధికార యంత్రాంగం మద్దతుతో యథేచ్చగా రిగ్గింగ్ చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
చనిపోయినోళ్ల ఓట్లూ వేశారు!
మా ఇంట్లో చనిపోయిన ఒక ముసలావిడ ఓటును కూడా కాంగ్రెస్ వాళ్లు వేశారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపినాథ్ ఆరోపించారు. చనిపోయినవాళ్ల ఓట్లను ఫొటోలు మార్చి దొంగ ఓట్లు వేస్తున్నారని, ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.