కుత్బుల్లాపూర్, జనవరి 1: రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి బదులు వారి మధ్య చిచ్చుపెట్టేలా తీసుకువచ్చిన జీఓ 252ను సవరించాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. గురువారం టీయూడబ్ల్యుజే-హెచ్(143) యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కొలెపాక వెంకట్ సారథ్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.
ద్వంద వైఖరి అవలంబిస్తోంది..
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధులుగా ఉండే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంబిస్తోందన్నారు. జీవో 252 పేరుతో జర్నలిస్టులను రెండు వర్గాలుగా విడగొట్టేందుకు సర్కార్ యత్నిస్తోందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈవిషయమై అసెంబ్లీలో మాట్లాడుతానన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులు, బస్పాస్లతో పాటు ఇతర సదుపాయాలను కల్పించిందన్నారు. అయితే ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావస్తున్నా నూతన అక్రిడిటేషన్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు రామారావు, భరత్కళ్యాణ్, రవికిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు సుగ్రీవుడు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధులు ఎర్రోళ్ల బాబు, కృష్ణ, సైదులు తదితరులు పాల్గొన్నారు.
252 జీవోపై అసెంబ్లీలో చర్చించండి
మేడ్చల్, జనవరి 1: అక్రిడిటేషన్ల సంఖ్యలో కోత, జర్నలిస్టులను విభజించేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిన 252 జీవోను సవరించే విషయంపై శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ మేడ్చల్ జిల్లా టీయూడబ్ల్యూజే, టీజేఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకు సబంధించిన ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేనంద్ను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కొలిపాక వెంకట్, సమస్తే తెలంగాణ జిల్లా సాఫర్ రామారావు, స్టాఫర్ల్లు భరత్ కల్యాణ్, రవికిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు సుగ్రీవుడు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎర్రోళ్ల బాబు, ఎర్రోళ్ల కృష్ణ, సైదులు తదితరులు పాల్గొన్నారు.