సిటీబ్యూరో/చిక్కడపల్లి/ఎల్బీనగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): జాబ్‌క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపేందుకు నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ప్రతీచోటా రోడ్లపైకి వచ్చి ధర్నా చేయాలని తలపెట్టారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు నిరుద్యోగుల ర్యాలీ, మహాధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా .. ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధర్నాలు, ఆందోళనలతో తమ నిరసనగళం వినిపిస్తున్నారు. కాగా, శనివారం ఉదయం 8 గంటలకే చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులను నిర్బంధించి లైబ్రరీ గేట్లకు బయటనుంచే తాళాలు వేసి కాపలాకాశారు. జాబ్‌క్యాలెండర్ హామీలను తుంగలో తొక్కిన రేవంత్‌రెడ్డి తీరును నిరసిస్తూ తాము తలపెట్టిన ర్యాలీని అడ్డుకోవడమే కాకుండా తమను అక్రమంగా లైబ్రరీలో నిర్బంధించడంపై నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొడంగల్‌కు చెందిన ఓ నిరుద్యోగి ఇది ప్రజాపాలన కాదు పనికి మాలిన పాలన అని మండిపడ్డారు. ర్యాలీకి వెళ్లాలనుకున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో వారు లైబ్రరీ గేట్ల వద్దే బైఠాయించి తమ నిరసన తెలిపారు.
మధ్యాహ్న భోజనానికీ వెళ్లకుండా!
నగర కేంద్ర గ్రంథాలయం ప్రభుత్వ తీరుతో ప్రతినిత్యం ఆందోళనలకు కేంద్రంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంతో మూడు రోజుల నుంచి లైబ్రరీ ప్రాంతంలో నిరుద్యోగుల నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం నిరుద్యోగుల ధర్నా నేపథ్యంలో నగర కేంద్ర గ్రంథాలయం గేటుకు పోలీసులు తాళం వేశారు. దీంతో గ్రంథాలయానికి వచ్చిన వివిధ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. గ్రంథాలయం సమీపంలో బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. కనీసం మధ్యాహ్న భోజనానికి పోవడానికి కూడా పోలీసులు అవకాశం ఇవ్వలేదంటూ గ్రంథాలయానికి వచ్చిన పలువురు అభ్యర్థులు వాపోయారు.

దిల్‌సుఖ్‌నగర్‌లో..
నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం చైతన్యపురి నుండి నినాదాలు చేస్తూ ర్యాలీగా దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్‌కు చేరుకుని జాతీయ రహదారిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని వారు విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుని గప్పాలు కొడుతోందని వారు ఆరోపించారు.
ఈ మేరకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు జాతీయ రహదారిపైకి చేరుకోవడంలో ఇరువైపులా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. పండుగ కోసం గ్రామాలకు వెళ్తున్న వారు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఇడీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్, జేఏసీ నాయకుడు ఇంద్ర నాయక్, ఆదిలాబాద్ ఏజెన్సీ డిఎస్సీ సాధన కమిటీ ఉమ్మడిజిల్లా అధ్యక్షుడు సుమేష్తో పాటుగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు.
అన్ని జిల్లాల్లో ఉద్యమం ఉధృతం చేస్తాం
కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టడంతో పాటుగా రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో చెప్పించి నిరుద్యోగుల అండతో అధికారంలోకి వచ్చి రెండేైళ్లెనా జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా మోసం చేస్తోందని నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు తప్పితే రెండేళ్ల క్రితం గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని వారు విమర్శించారు. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని, శ్రీధర్ బాబు తప్పుడు ప్రకటన చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ కోసం ఆందోళన చేస్తున్న తమకు పోలీసుల నుంచి లాఠీచార్జీలు, అరెస్టులు ఎదురవుతున్నాయన్నారు. నిరుద్యోగుల అండతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో చిత్తుగా ఓడిస్తామని వారు పేర్కొన్నారు. ఇకపై అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.