కందుకూరు, ఫిబ్రవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డ్రామాలు అడుతున్నదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని సమావేశపు హాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం లేదని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డ్రామాలు అడుతున్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధమన్నారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, డైరెక్టర్ పొట్టి ఆనంద్, మాజీ మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.