కరెంటు కోతలతో కాంగ్రెస్ సర్కార్ నగరాన్ని అంధకారంలోకి నెడుతోందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం పూట అప్రకటిత కరెంట్ కోతలకు తోడు రాత్రి సమయాల్లో వీధిలైట్లు వేయకపోవడం, కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో అధికారులు సకాలంలో స్పందించకపోవడం పట్ల నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చిన్నపాటి వర్షానికే విద్యుత్ తీసేస్తుండటంతో వర్క్‌ఫ్రంహోమ్, ఇతరత్రా పనులు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ లేకపోవడంతో దోమలతో రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎస్పీడీసీఎల్ అధికారిక ఎక్స్ఖాతాను ట్యాగ్చేస్తూ ఓ మహిళ ‘కరెంట్ కోతలే అభివృద్ధి అంటారా’ అని చేసిన కామెంట్ విద్యుత్ పరంగా నగర దుస్థితికి
సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని అశోక్‌నగర్ వద్ద సోమవారం రాత్రి కరెంట్ లేకపోగా మంగళవారం ఉదయం తిరిగి తొమ్మిది గంటల నుంచి సుమారుగా ఐదు గంటల పాటు కరెంట్ లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. ఈనెల 9 న కురిసిన వర్షానికి తమ ఏరియాలో కరెంట్ సుమారు 14గంటలకు పైగా పోయినప్పటికీ విద్యుత్ అధికారులు సైప్లె విషయంలో సరైన శ్రద్ధ కనబరచకపోవడం వల్లే తిరిగి మళ్లీ రెండురోజులు కరెంట్ సరఫరాలో గంటల తరబడి అంతరాయమేర్పడుతున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మలక్‌పేటలోని జడ్జ్కాలనీ, ఆనంద్‌నగర్ కాలనీ, బోరబండ మోతీనగర్‌లోని స్నేహపురికాలనీ,హైదరాబాద్ సౌత్ సర్కిల్లోని అస్మాన్‌ఘడ్ సెక్షన్లలో రాత్రి నుంచి అడపాదడపా కరెంట్ పోవడంతో పాటు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చిందని, తిరిగి ఉదయం కూడా నాలుగు నుంచి ఐదు గంటలు కరెంట్ పోయిందని స్థానికులు చెప్పారు. అమీర్‌పేట ధరమ్కరన్రోడ్డులో సోమవారం మధ్యా హ్నం రెండుగంటలకు కరెంట్ పోంది. గంటల తరబడి కరెంట్ రాకపోవడంతో ఫిర్యాదుచేయగా మీ సమస్య విద్యుత్ సరఫరాలో సమస్యలు, కొన్ని సమస్యల వల్ల ఆ ఫిర్యాదును మూసేస్తున్నామంటూ మెసేజ్‌లు వచా ్చయి.
సమస్య పరిష్కారం కాకుండానే మెసేజ్‌లు వచ్చి సమస్య మాత్రం గంటల తరబడి ఎదురుచూసినా పరిష్కారం కాకపోవడం గమనార్హం. ఇబ్రహీంపట్నం విజయలక్ష్మీనగర్ ప్రాంతంలో ఈనెల 19 న ఉదయం ఏడుగంటలకు కరెంట్ పోతే 1912 కు వినియోగదారుడు ఫోన్ చేశారు. యూ ఆర్ ఇన్ క్యూ అంటూ పదిహేను నిముషాల పాటు వెయిటింగ్లో పెట్టింది. తీరా కాల్ చేసి మరోసారి ప్రయత్నిస్తే అదే అనుభవం ఎదురైంది. చేసేదేం లేక డిస్కం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ చాట్బట్లో ప్రయత్నించారు. లొకేషన్ షేర్ చేసినప్పటికీ పదేపదే అదే అంశాన్ని అడుగుతుండడంతో వినియోగదారుడు మండిపడ్డారు.
కరెంట్ కోతలే అభివృద్ధి అంటారా..!
సోమవారం ఎస్పీడీసీఎల్ అధికారిక ఎక్స్ఖాతాను ట్యాగ్చేస్తూ ఓ మహిళ చేసిన కామెంట్ విద్యుత్ పరంగా నగర దుస్థితికి అద్దంపడుతోంది. జీడిమెట్లలోని పైప్లైన్రోడ్లో ఉంటున్న తాము తరచూ విద్యుత్‌కోతలతో ఇబ్బంది పడుతున్నామని, తాను కోల్‌కతా నుంచి వచ్చినప్పుడు అక్కడ సీఈఎస్సీ లిమిటెడ్ అనే ఒక పటిష్టమైన వ్యవస్థను చూశానని, కానీ హైదరాబాద్‌లో చాలా విద్యుత్‌కోతలు ఉన్నాయని, దీనిని అభివృద్ధి అంటారా అంటూ ప్రశ్నించారు. ఒకవైపు టీజీఎస్పీడీసీఎల్ యంత్రాంగం మొత్తం లైన్ టు లైన్ సర్వే పేరుతో సర్కిళ్ల వారీగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుంటే మరోవైపు ఎండాకాలం కంటే వర్షాకాలం ప్రారంభంలోనే కరెంట్ కోతలు ఎక్కువగా ఉండడంతో ఈ పర్యటనలలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారా అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నగరంలోని మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలో జరుగుతున్న విద్యుత్ అధికారుల క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వినియోగదారుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందా అంటే ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా ఉపశమనం తప్ప ముఖ్యమైన సమస్యలు పెండింగ్‌లోనే ఉంటున్నాయని ఆయా సర్కిల్ అధికారులే చెబుతున్నారు. ఆరునెలల కాలంలో కరెంటోళ్ల ప్రజాబాట పేరుతో వారానికి మూడురోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన అధికారులు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇక 99రోజుల ప్రజాపాలన కార్యక్రమంలోనూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్కిళ్ల వారీగా తిరగాల్సి ఉండగా కార్యాలయాలకే పరిమితమయ్యారు.
ఈలోగా ఎస్పీడీసీఎల్ సీఎండీ క్షేత్రస్థాయి పర్యటనలేవి అంటూ నమస్తే తెలంగాణ కథనాలు రాయడంతో సీఎండీ జితేశ్ పాటిల్ నగరంలోని పలు సర్కిళ్లలో వాక్ అలాంగ్ ద లైన్ పేరుతో లైన్ టు లైన్ పర్యటనలు చేస్తున్నారు. ఆయా సర్కిళ్లకు సీఎండీ వచ్చినరోజు స్థానిక అధికారులు హడావిడి చేస్తూ ముందస్తుగా తాము నిర్దేశించిన రూట్లలోనే ఆయన పర్యటనను కొనసాగిస్తున్నారు. అక్కడ ఎక్కువగా చెట్ల కొమ్మలు పెరిగిన విషయాలు చూపించడం, కొన్ని డీటీఆర్లు, పోల్స్‌కు సంబంధించిన సమస్యలు చెప్పి ఆయన వెళ్లిపోయిన తర్వాత మళ్లీ కార్యాలయాలకే పరిమితమవుతున్నారంటూ స్థానికులు చెప్పారు. ఒకవైపు స్థానికంగా వచ్చే సమస్యలు ఒక ఎత్తైతే కొందరు ఇంజనీర్ల వ్యవహారశైలి చాలా సమస్యలకు కారణమవుతున్నదన్న విమర్శలు ఉన్నాయి.
ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో ఓవర్‌హెడ్ లైన్లు తెగిపడిన వెంటనే సర్క్యూట్ బ్రేక్ అయి రిప్లే ప్రొటెక్షన్ తెరుచుకుని రెప్పపాటు సమయంలోనే ఫీడర్ ట్రిప్ అయి సరఫరా ఆగిపోవాలి. కానీ ఈ ప్రమాదాల సమయంలో ఫీడర్లు ట్రిప్ కాకపోవడం, ప్యూజులు కొట్టేయకపోవడానికి కారణం ఇంజనీర్ల వైఫల్యమేనని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. సబ్స్టేషన్లలో ఏఈ, ఏడీఈ, డీఈ పీరియాడికల్ తనిఖీలు చేసి ఎర్తింగ్, ఆయిల్లెవల్స్ను పరిశీలించాల్సిన చోట ఆ పరిస్థితులే లేవని స్థానికులు చెప్పారు.
విద్యుత్ సరఫరా అస్తవ్యస్తం
ప్రతీరోజూ కాల్‌సెంటర్ సహా ఇతర మార్గాల ద్వారా ఎలక్ట్రిసిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సుమారు రెండువేలకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో నిరంతర విద్యుత్ అందిస్తాం.. అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెబుతున్న సర్కార్ మాటలకు, చేతలకు పొంతనే లేదని గ్రేటర్ వాసులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అనేక మంది వినియోగదారులు విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో సతమతమవుతున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం వచ్చినా.. ఏ గాలి లేకుండా వర్షం పడకున్నా సరఫరాలో అంతరాయాలు మాత్రం తప్పకపోవడంతో నగరంలో విద్యుత్ సరఫరా పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు వర్షం పడినా, పడకున్నా.. కరెంట్ పనుల పేరుతో ఉదయం మూడు నాలుగుగంటలు, మళ్లీ వర్షం పడడం లేదా ఈదురు గాలులతో రాత్రంతా కరెంట్ తీసేయడంపై నగరవాసులు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే సంప్రదించాల్సిన 1912 నెంబర్‌పై ఒత్తిడి పెరుగుతుండడంతో సరిగా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వీటికి తోడు చాలామంది తాము 1912తో పాటు ఇటీవల డిస్కం కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సప్చాట్బాట్లో కూడా ఫిర్యాదులు చేస్తుంటే అడిగిన ప్రశ్నలే అంటే లొకేషన్ పదేపదే పెట్టమంటూ వస్తున్న సమాచారంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని సీబీడీ, ఆపరేషన్ విభాగం ఇంజనీర్లకు వెంటనే చేరుస్తామని చెప్పుకుంటున్న దక్షిణ డిస్కం, వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు స్వీకరించి వాటికి సత్వర పరిష్కారం చూపించడంలో మాత్రం విఫలమవుతోంది.
చెట్ల కొమ్మలు కొట్టేసి.. అలాగే పడేసి!
కరెంట్ సరఫరా పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే వర్షాకాలంలో చెట్ల కొమ్మల నరికివేత కార్యక్రమం పెట్టుకున్న టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలను ఆనుకుని ఉన్న చె ట్ల కొమ్మలు తీసేయడానికి ఎల్సీల పేరుతో నాలుగైదు గంటలు కరెంట్ కోతలు విధిస్తోంది. అంతేకాకుండా చెట్ల కొమ్మలు కొట్టిన తర్వాత తిరిగి అదే ప్రాంతంలో పడేయడంతో రోజుల తరబడి నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైనే కొట్టేసిన చెట్టుకొమ్మలు కనిపిస్తున్నాయి. వీటిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోడ్లపై పేరుకుపోతున్న చెత్తతోనే తాము తం టాలు పడుతుంటే ఈ చెట్ల కొమ్మలు మరింత సమస్యగా మారాయంటూ వారు మండిపడుతున్నారు.