సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డుల జారీలో కాంగ్రెస్ ప్రభుత్వం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. పేదలకు రేషన్ కార్డులు అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. కొత్త కార్డు కోసం దరఖాస్తులు చేసుకొని.. ఏడాది గడుస్తున్నా పేదలకు నిరాశే మిగులుతున్నది. ఆరు నెలల్లోనే నగరంలోని అన్ని డివిజన్లలో రేషన్ కార్డుల మంజూరు పూర్తి చేస్తామని ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఉత్తమాటే అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఇండ్లకు ఇప్పటిదాకా విచారణకు రాలేదని వాపోతున్నారు. మరికొన్ని చోట్ల అర్హులను వదిలేసి.. ఎలాంటి అర్హత లేనివారికి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే కొత్త కార్డులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.
2,19,717 మంది దరఖాస్తు..
హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,19,717 మంది దరఖాస్తు చేసుకుంటే.. దాదాపు లక్ష మందికి మాత్రమే కొత్తకార్డులు అందాయి. మరో లక్షకు పైగా ఎంక్వైరీ దశలో ఉన్నట్లు అధికారిక సమాచారం. దరఖాస్తు చేసుకుని ఏడాది కావొస్తున్నా సగం మందికి కూడా మంజూరు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉండటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉన్నదని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు.
సెప్టెంబర్ కోటా వారికే..
వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను అందజేశారు. మూడు నెలలు పూర్తికావడంతో సెప్టెంబర్ నెల సరుకులు పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈనెల 20 లోపు కొత్త రేషన్ కార్డులు వచ్చినవారికే సెప్టెంబర్ నెల కోటా సరకులను అందజేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ జిల్లాలోని రెండు లక్షల పైగా దరఖాస్తుదారుల్లో ఇప్పటిదాకా లక్ష మాత్రమే జారీ చేశారు. మిగిలిన లక్షకు పైగా మంది అర్హులు సెప్టెంబర్ కోటా బియ్యం తీసుకోలేని పరిస్థితి నెలకొంది.
దరఖాస్తు చేసుకొని ఏడాది దాటుతున్నా అర్హులను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరగటం వల్లే అర్హతలున్నా సరకులను పొందలేని దుస్థితి వచ్చిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు సెప్టెంబర్ నెల బియ్యం తీసుకుంటే.. తమకు అన్ని అర్హతలున్నా కార్డులు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా తమకు తొందరగా రేషన్‌కార్డులు మంజూరు చేసి సరుకులు అందేలా చూడాలని కోరుతున్నారు.
ఎందుకింత జాప్యం?
రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకొని ఏడాది అవుతున్నా అర్హులందరినీ గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అర్హులను గుర్తించేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. మూడు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నా ఇప్పటికీ దరఖాస్తుల్లో సగం మందికి కూడా కార్డులు అందకపోవడం గమనార్హం. కొన్ని కాలనీల్లో ఇప్పటికీ తమ వద్దకు విచారణ అధికారులు రాలేదని దరఖాస్తుదారులు చెబుతున్నారు.
మరికొన్ని చోట్ల తమ పక్కింటి వారిని విచారించి, కార్డు మంజూరు చేశారని, తమ వద్దకు మాత్రం ఇంతవరకు ఏ అధికారి రాలేదని అంటున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల అనుచరులు, అనుకూలమైన వారికే ముందుగా రేషన్ కార్డులు అందజేస్తున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అధికారులు జాప్యం చేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు అందాల్సిన సరుకులను పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరాల అధికారులు, ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ తొందరగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.