విశ్వనగరంగా ఎదగాల్సిన హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ సర్కారు పగబట్టినట్లు వ్యవహరిస్తున్నది. గడిచిన పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన నగరాన్ని, ఇప్పుడు పాలనా సంస్కరణల పేరుతో మూడు ముక్కలు చేసి అభివృద్ధికి మంగళం పాడుతోంది. జీహెచ్ఎంసీని మూడు ముకలు (జీహెచ్ ఎంసీ, సైబరాబాద్, మలాజిగిరి) చేసిన సరారు, ఒకో కార్పొరేషన్ కు రూ. 500 కోట్ల చొప్పున వెచ్చించి తక్షణ పనులను పూర్తి చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ, మూడు నెలలు కావొస్తున్నా నేటికీ ఒక రూపాయి కూడా విడుదల కాకపోవడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతున్నది. కనీస మౌలిక వసతుల కల్పన లేకపోవడం, నాలా, వరద నీటి కాలువలు, రోడ్ల మరమ్మతులు, పారిశుధ్య నిర్వహణ సరిగా లేక సమస్యల సుడిగుండంలో పౌరులు నలిగిపోతున్న పరిస్థితి నెలకొంది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) :నగరంలో కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని, ఒక్కో కార్పొరేషన్‌కు రూ. 500కోట్లు ఇస్తామని స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ ప్రకటించినప్పటికీ ఆర్థిక శాఖ నుంచి స్పందన కరువైంది. కేవలం ప్రకటనలకే పరిమితమైన ఈ రూ. 1500 కోట్లు ఎప్పుడు కేటాయిస్తారో స్పష్టత లేదు. దీనికి తోడు జీహెచ్ఎంసీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడమే సరైన పద్ధతి అని కమిటీ సూచించింది. జీహెచ్ఎంసీకి రూ. 4,770 కోట్ల అప్పులకు సంబంధించి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు తయారు చేసి సర్కారు అందజేసింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు సంబంధించి జీహెచ్ఎంసీకి రూ. 5,834 కోట్లు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలు సైతం ప్రభుత్వం వైపే మూడు నగర పాలక సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.
జీతాలకు పొంచి ఉన్న గండం..
మూడు కార్పొరేషన్ల పరిధిలో ఎకడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. 99 రోజుల పట్టణ ప్రణాళికల స్పెషల్ డ్రైవ్‌లు జరుగుతున్న రోజకో జీవీపీ (’తరచూ చెత్త వేసే ప్రాంతాలు) కొత్తగా పుట్టుకొస్తున్నాయి. స్వీపింగ్ యంత్రాలకు డీజిల్ పోయడానికి, చెత్త తరలించే టిప్పర్ల నిర్వహణకు నిధులు లేక వ్యవస్థ కుంటుపడింది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్‌తో పాటు నిర్వహణ భారంగా మారిందని ఫైనాన్స్ విభాగం అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నెల 1న వేతనాలు ఎలా ఇవ్వాలో తెలియక ఫైనాన్స్ విభాగం తర్జనభర్జన పడుతున్నది. ఎర్లీబర్డ్ ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడం సైతం అధికారులకు నెలవారీ నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు సవాల్‌గా మారాయి. మొత్తంగా జీహెచ్ఎంసీని విడగొట్టి అధికార వికేంద్రీకరణ చేస్తామని చెప్పిన సరారు, వాస్తవానికి బాధ్యతలను విస్మరించిందని పౌరులు మండిపడుతున్నారు. విభజన వల్ల కొత్త పోస్టులు, కొత్త కార్యాలయాల ఖర్చు పెరిగింది తప్ప, సామాన్యుడికి దక్కిన ప్రయోజనం ఏమి లేదని విమర్శిస్తున్నారు.