మక్క రైతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. గొప్పలకు పోయిన ప్రభుత్వం తీరా మక్కల కొనుగోలు కేంద్రాల్లో బార్దాన్ సంచుల కొరత కూడా తీర్చలేదు. కొనుగోలు కేంద్రాలకు బార్దాన్ సంచుల సరఫరా లేక రైతులు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. మక్కలు విక్రయించి 45 రోజులు గడస్తున్నా ఇంతవరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయలేదు. కొనుగోలు కేంద్రాల్లో మక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే సర్కార్ ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సర్కార్ తీరుపై సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్కన్నపేట, మే 9: మార్క్ఫెడ్ అధికారులు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో మార్చి చివరి వారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు జిల్లాలో నాలుగువేల మంది రైతుల నుంచి 2.20 లక్షల క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు మక్కలు అమ్ముకున్న రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా నగదు జమ చేయకపోవడం గమనార్హం.
గన్నీ సంచుల కొరత… మార్కెట్లో బ్లాక్ దందా
మక్కల కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత ఏర్పడటంతో మార్కెట్లో బ్లాక్ దందా మొదలైంది. గతంలో 50 కిలోల బార్దాన్ సంచికి రూ. 15 నుంచి రూ. 18 వరకు తీసుకునేది. మక్కల కొనుగోలు కేంద్రాల్లోని నిర్వాహకులు గన్నీ బ్యాగులు లేవని, బయట నుంచి సంచులు తెచ్చుకోవాలని చెప్పడంతో గన్నీ బ్యాగులకు డిమాండ్ పెరిగింది. బ్లాక్లో ఒక్కో గన్నీ బ్యాగు రూ. 25 నుంచి రూ. 28 వరకు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ గత్యంతరం లేక రైతులు ఎక్కువ ధరకు గన్నీ బ్యాగులు కొనుగోలు చేయకతప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లోని మక్కలు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
60 క్వింటాళ్ల డబ్బులు రావాలి
కట్కూరులోని మక్కల కేంద్రంలో మొదటి మక్కలు కొన్నారు. విక్రయించి సుమారు 45 రోజులు దాటింది. 60 క్వింటాళ్ల మక్కజొన్న డబ్బులు రావాలి. పైసల కోసం రోజూ ఎదురుచూసుడే అయితుంది. కొనుగోలు కేంద్రంలో మక్కలు అమ్ముకున్న పాయిదా లేకుండా పోయింది. గింత అధ్వానం సర్కార్ను ఎక్కడా చూడలేదు. పైసలు వస్తాయా.. రావా… వస్తే ఎప్పుడు వస్తాయి అనే గ్యారెంటీ కూడా లేకుండా పోయింది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి ఎవుసం చేస్తే సర్కార్ తీరు సక్రమంగా లేదు.
– జెట్టి దాసు, మక్క రైతు, కట్కూరు (సిద్దిపేట జిల్లా)
కొనుగోలు కేంద్రానికి వచ్చి 15 రోజులు
కట్కూరులోని మక్కల కొనుగోలు కేంద్రానికి వచ్చి 15 రోజులు గడిచింది. తూర్పార పట్టి 139 బస్తాలు నింపి పరదాలు కప్పి ఉంచినం. వర్షం పడితే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. సర్కార్ సరిగ్గా కొనుగోలు చేయడం లేదు. మొన్నటి దాకా మంచిగానే నడిసింది. ఇప్పుడు రైతులే బార్దాన్ బస్తాలు తెచ్చుకోవాలని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నాం. మక్కలు కొనడానికి ప్రభుత్వం కొర్రీలు పెట్టడం సరికాదు.
– భూక్యా తిరుపతి, రైతు శ్రీరాంతండా, (సిద్దిపేట జిల్లా )
రెండు, మూడు రోజుల్లో డబ్బులు జమవుతాయి
మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మక్కలు అమ్ముకున్న రైతుల ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో నగదు జమ చేస్తాం. రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం ఆలస్యమైంది. గన్నీ బ్యాగుల కొరత ఉండటంతో కొంత ఇబ్బంది అవుతుంది. రైతులు గన్నీ బ్యాగులు కొనుగోలు చేయడం వల్ల వారి ఖాతాల్లో సర్కార్ ఒక గన్నీ బ్యాగుకు రూ. 22 చెల్లిస్తోంది. మక్కల డబ్బులతో పాటు గన్నీ బ్యాగుల పైసలు కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువ స్థాయిలో మక్కలు కొనుగోలు చేస్తున్నాం.
– నాగేశ్వర్, మార్క్ఫెడ్ డీఎం (సిద్దిపేట జిల్లా)