మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 7 : తరతరాలుగా సాగు భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడింది. రైతుల నుంచి భూమిని లాక్కొని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. అన్యాయంగా తమ భూమిని లాక్కొంటే.. ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 388లో వృథాగా ఉన్న 33 ఎకరాల భూమిలో దాదాపు 70 ఏండ్ల కిందట పలువురు రైతులు సాగు భూమిగా మార్చుకొని, వ్యవసాయం చేస్తున్నారు. ఏండ్లుగా వరితో పాటు పశుగ్రాసాన్ని పండిస్తున్నారు. కాగా, ఆ భూమిపై కన్నెసిన కాంగ్రెస్ సర్కారు..అక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నది.
మంగళవారం నాలుగెకరాల భూమిలో పోలీసు పహారాలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. విషయాన్ని తెలుసుకున్న రైతులు బుధవారం కడీలను విరగొట్టి, ఫెన్సింగ్‌ను తొలగించారు. భూమిని చేసే వందలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటుతో మిగితా భూమి కూడా సాగుకు పనికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘మా ముత్తాతలు, మా తాతలు మా నాన్నలు మరి ఇప్పుడు మేము వ్యవసాయం చేస్తున్నా.. వంటి మా భూమిని హెచ్ఎండబ్ల్యూఎస్ కేటాయిండంతో దాదాపు ఈ భూమిని నమ్ముకున్న 250 కుటుంబాలు అన్యాయం జరుగుతున్నది. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం’ అని రైతు మంచాల మహేందర్ అన్నారు. 60 ఏండ్లుగా రాంపల్లి శివారులో రైతులు సాగు చేసుకుంటున్న భూమి జోలికి వస్తే సహించేది లేదని సీపీఎం కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితులకు సీపీఎం అండగా ఉంటుందన్నారు.