సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఈనెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్లు దాటిన వారితోపాటు పీడబ్ల్యూడీ ఓటర్లు ఇంటి వద్దనే ఓటేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించింది. ఈ నేపథ్యంలో అర్హులైన వారు ఓటు వేసే అవకాశం కల్పించేందుకు ఫారం-12 డీని (పోస్టల్ బ్యాలెట్) పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు తమ ఇంటి వద్దనే ఓటేసేందుకు అర్హులుగా సంబంధిత రిటర్నింగ్ అధికారులు గుర్తించారు.
సోమవారం నుంచి హోమ్ ఓటింగ్ వేసేందుకు జిల్లా ఎన్నికల అధికారి చర్యలు తీసుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొత్తం 26 మంది హోమ్ ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఓటింగ్‌లో కూడా సాధారణ పోలింగ్ మాదిరిగానే ఓటింగ్ ఉంటుంది. జిల్లాలో మొత్తం 838 మందికి హోమ్ ఓటింగ్‌కు ఆర్వోల నుంచి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి.
పోస్టల్ బ్యాలెట్ ప్రకారంగా.. ఇంటింటికీ వెళ్లి ఓటు వేయించాలి. హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం హోమ్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అర్హులు తప్పని సరిగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మొదటి సారి ఇంటింటికీ వెళ్లి ఓటు హక్కు కల్పిస్తారు. ఒకవేళ ఆ సమయంలో ఓటరు లేని పక్షంలో.. రెండోసారి ఓటరు సమయం తీసుకొని ఆ సమయం ప్రకారంగా వెళ్లి ఓటు వేయిస్తారు. ఈ హైదరాబాద్ జిల్లాలో మొత్తం 838 మంది హోం ఓటింగ్‌ను వినియోగించుకోనున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రచారాలకు తగిన బందోబస్తు కల్పిస్తూనే.. ఓటింగ్ రోజు తీసుకోవాల్సిన బందోబస్తు చర్యలపై ట్రై పోలీస్ కమిషనర్లు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే బూత్ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, బూత్ నుంచి స్ట్రాంగ్ రూమ్‌లకు ఈవీఎంల తరలింపునకు సంబంధించిన రూట్‌మ్యాప్‌లు.. తదితర అంశాలపై ఉన్నతాధికారులు చర్చించి ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలింగ్ డే దగ్గర పడుతుండటంతో ఇక పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు, సున్నిత ప్రాంతాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు. 28వ తేదీ సాయంత్రానికి ప్రచార పర్వం పూర్తవుతోంది. ఆ తరువాత ఆయా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలని కింది స్థాయి సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంత వాతావరణం, పటిష్ట బందోబస్తులో ఈ నెల 30వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు పూర్తిగా సిద్ధమయ్యారు.
సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీస్, పీఓ పోలింగ్ అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో వీరికి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల్లో సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ తెలిపారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను రొనాల్డ్‌రాస్ మంగళవారం పరిశీలించారు. కార్వాన్‌లోని గోల్కొం డ, చార్మినార్‌లోని మొఘల్‌పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్, బహదూర్‌పురలోని తాసీల్దార్ కార్యాలయం ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు కమిషనర్ పరిశీలించారు. సనత్‌నగర్, ముషీరాబాద్, అంబర్‌పేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను డిప్యూటీ డీఈఓ, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు.
అంబర్‌పేట, నవంబర్ 21 : వృద్ధులు, దివ్యాంగులకు ఎలక్షన్ కమిషన్ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది. అంబర్‌పేట నియోజకవర్గంలోని 236 పోలింగ్ కేంద్రాల పరిధిలో 51 మందికి ఇంటి నుంచి ఓటు వేసే వీలు కల్పించారు. ఎన్నికల సిబ్బంది 80 ప్లస్ వయస్సున్న వారి ఇంటికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్లను అందజేశారు. దీన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, రిటర్నింగ్ అధికారి అపర్ణ, ఏఆర్ఓ మారుతీ దివాకర్, డిప్యూటీ కలెక్టర్ అశోక్‌రెడ్డి, పోస్టల్ బ్యాలెట్ ఇన్చార్జి రజిత తదితరులు పరిశీలించారు. బుధవారం కూడా ఈ అవకాశం ఉంది.
అంబర్‌పేటలో ఉన్న పోలీసు కుటుంబాలకు కూడా మంగళవారం పోస్టల్ బ్యాలెట్‌ను నిర్వహించారు. మొత్తం 587 ఓట్లు ఉన్నాయి. సీపీఎల్‌లో ఉన్న పోలీసు క్లబ్ హౌస్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి పరిశీలించారు. బుధవారం కూడా ఈ అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్వో అపర్ణ, ఏఆర్ఓ మారుతీ దివాకర్, డిప్యూటీ కలెక్టర్ అశోక్‌రెడ్డి, పీఓ రజిత, కాచిగూడ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.