కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ‘హైడ్రా’షాక్‌లతో నగర రియాల్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. ‘ఆఫర్లు ఉన్నాయి.. అందుకోండి’ అంటూ నెత్తినోరు మొత్తుకున్నా.. లాభం లేకుండా పోతున్నది. నగరంలో రియల్ లావాదేవీలు పెరుగుతున్నాయంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా..కుప్పకూలిన రియాల్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. నిట్టనిలువునా కిందకు జారి పడిపోతున్నది. రియల్ ఎస్టేట్ సంస్థలే నేరుగా రంగంలోకి దిగి.. ఫ్యాక్టరీ అవుట్ లెట్ సేల్స్ తరహాలో కస్టమర్లను ఆకట్టుకునే చర్యలు చేపడుతున్నా.. ఆశించిన స్పందన లేకుండాపోయింది.
-సిటీబ్యూరో
నగరంలో హైరైజ్ ప్రాజెక్టును ఓ నిర్మాణ సంస్థ చేపట్టింది. ఇటీవలే ప్రాజెక్టును విక్రయానికి సిద్ధం చేసింది. గతంలో అదే సంస్థ చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే… 60 శాతానికి పైగా ఫ్లాట్లు అమ్ముడుపోవడంతో… ఇక గిరాకీకి ఎలాంటి ఢోకా ఉండదని.. ఇంకో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కానీ ఇప్పటివరకు ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నా… కొనుగోలుదారులు ఆ సంస్థ గడప తొక్కడమే మానేశారు. ఇక లాభం లేదని భావించిన సదరు సంస్థ.. విభిన్న రకాల మార్కెటింగ్ ఆఫర్లతో కస్టమర్ల చెంతకు చేరేందుకు ప్రయత్నిస్తున్నది. తాజాగా తక్షణ బుకింగ్‌పై ఏకంగా రూ. లక్ష నగదు పురస్కారాన్ని అందిస్తున్నది.
షాద్‌నగర్ వైపు ఓపెన్ ప్లాట్ లే అవుట్‌ను ఓ నిర్మాణ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక పనులు 30-40 శాతం మేర పూర్తి కావడంతో… మార్కెటింగ్ అమ్మకాలు మొదలవుతాయని భావించింది. వీకెండ్లో వెంచర్ కొనుగోలుదారుల రాకపోకలతో నిండిపోతుందని కలల్లో విహరించింది. ఆరు నెలలు గడిచినా… ఒక్క ప్లాట్ అమ్ముడుపోలేదు. ఆ సంస్థ… ఓపెన్ ప్లాట్ తీసుకుంటే క్లబ్ మెంబర్షిప్ ఫ్రీ అంటూ.. ప్రచారం మొదలుపెట్టింది. అయినా కదలిక రాకపోవడంతో 15 శాతం తక్కువ ధరలో ఫార్మ్ హౌస్ నిర్మిస్తామంటూ ఆఫర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది.
గడిచిన ఐదారేండ్లుగా నిర్మాణ రంగంలో జరిగిన లావాదేవీలు.. వ్యాపారులనే కాకుండా, కొనుగోలుదారులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. కానీ అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత నగరంలో రియల్ క్రయవిక్రయాలు నిట్టనిలువునా కిందికి జారి పడ్డాయి. ఇక రేవంత్ ప్రభుత్వం భయపెట్టడమే లక్ష్యంగా అమలు చేసిన కూల్చివేతలతో రియాల్టీ రంగం వెంటిలేషన్ దశకు చేరుకున్నది. అయితే పరిస్థితిని గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టడంతో మార్కెట్లో క్రయవిక్రయాలకు అవకాశమే లేకుండా పోయింది.
ఆఫర్లకు ఆదరణ కరువు…
కొనుగోలుదారులను ఆకట్టుకునేలా నిర్మాణ సంస్థలు ఆఫర్లతో ఊరిస్తున్నాయి. కానీ కొనేందుకు కస్టమర్లు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి గడిచిన ఏడాదిన్నర కాలంగా రియాల్టీపై కలిగిన భయాందోళనల ప్రభావమే కారణమని వ్యాపారులు భావిస్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉండే ప్రాజెక్టులకైతే పరిస్థితి మరింత దారుణంగా ఉందని, కనీసం సైట్ విజిటింగ్లు కూడా జరగడం లేదని వాపోతున్నారు. ఇక కొనుగోలుదారుల కోసం ఫ్రీ అమెనిటీస్, జీఎస్టీ రద్దు, రిజిస్ట్రేషన్ చార్జీల్లో రాయితీ వంటి ఆఫర్లతోపాటు, స్పాట్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు రూ. లక్ష నుంచి లక్షన్నర నగదు బహుమతులను అందజేస్తామని చెప్పినా.. కొనుగోలుదారులు ఆసక్తి చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇటీవల ఓ నిర్మాణ సంస్థ మార్కెటింగ్ ఆఫర్లతో నేరుగా కస్టమర్లకు రూ. లక్ష క్యాష్ బ్యాక్ సదుపాయాన్ని అందిస్తూ పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నా… సైట్ విజిటింగ్ ఫుట్ ఫాల్స్‌లో ఏ మాత్రం మార్పు లేదని మార్కెటింగ్ సిబ్బంది అసహానానికి గురవుతున్నారు.
30-40 శాతం లావాదేవీలు డౌన్…
బడా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా కొత్త ప్రాజెక్టులను లాంచింగ్ చేయడం కంటే… ప్రాజెక్టుల్లోని ఇన్వెంటరీ క్లియరెన్స్‌పై దృష్టి పెట్టాయి. ఎప్పుడో హ్యాండోవర్ అయ్యే ఫ్లాట్ల కంటే రెడీ టూ మూవ్ ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయినా రెండేండ్ల కిందటితో పోల్చితే 30-40 శాతం అమ్మకాలు, బుకింగ్ తగ్గినట్లు నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. ఇక రెడీ టూ మూవ్ ప్రాజెక్టులలో కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటించాల్సి వస్తున్నా… క్రయ విక్రయాలు పుంజుకునే అవకాశం కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో… ఉన్న ఇన్వెంటరీ తగ్గితే… కొంత ఆర్థికంగా వెసులుబాటు వస్తుందని భావించి.. మార్కెటింగ్ రిస్క్ చేస్తున్నామని వ్యాపారులు, మార్కెటింగ్ సంస్థలు లెక్కలు వేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి సిటీ రియాల్టీ తిరోగమన పర్వంగా ఇంకెన్నాళ్లు అనేది ఇప్పటికీ అంతు చిక్కని వ్యవహారంగా మారింది.