సిటీబ్యూరో, జనవరి 31 ( నమస్తే తెలంగాణ ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలబెట్టిన అపర భగీరథుడిపై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆదివారం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణకు పిలవడంపై రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ వ్యాప్తంగా గులాబీ దండు కదలిరానున్నది. ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టేందుకు సమాయత్తమయ్యారు. కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీలు చేయనున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి హస్తం పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. తమ నాయకుడి జోలికి వస్తే అగ్గిపుట్టిస్తామంటూ పలువురు బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ప్రధాన రోడ్ల మార్గాల్లో ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేయనున్నారు. బీఆర్ఎస్పై అక్రమ కేసులు పెడుతున్న రేవంత్సర్కార్కు ప్రజా క్షేత్రంలో బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. కాగా, బీఆర్ఎస్ కార్యకర్తలు సిట్ విచారణ జరిగే ప్రాంతానికి భారీగా తరలిరానున్నారు.