బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో నాటిన మొక్కలు నగరానికే తలమానికంగా మారాయి. కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లు చల్లని నీడను ఇవ్వడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. కానీ రేవంత్ సర్కార్ అండర్‌పాస్‌ల నిర్మాణం, మల్టీ ఫ్లైఓవర్ల కోసం బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని బసవతారకం క్యాన్సర్స్ ఆస్పత్రి నుంచి రోడ్ నం. 12లోని అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ రోడ్డు మధ్యలో ఉన్న సెంట్రల్ మీడియన్లతో పాటు ఫుట్‌పాత్‌లపై ఉన్న భారీ వృక్షాలను నరికివేస్తున్నారు. తెలంగాణ భవన్ నుంచి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రోడ్డు మధ్యలో సుమారు 1000 దాకా భారీ వృక్షాలను నేలకూల్చారు. దీంతో పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– బంజారాహిల్స్, ఏప్రిల్ 21
హరిత హారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో కోట్లాది మొక్కలు నాటి సంరక్షించింది. అవి నేడు భారీ వృక్షాలుగా మారి కాంక్రీట్ జంగల్లాంటి హైదరాబాద్‌కు ఊపిరిపోస్తున్నాయి. ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియన్లలో భారీ వృక్షాలు నగరానికే తలమానికంగా మారాయి. నీడను ఇవ్వడంతో పాటు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.

వృక్షో రక్షతి రక్ష అంటూ పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో కోట్లాది మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించింది. శివారు ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సైతం హరితహారం కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నాటిన మొక్కలు నేడు భారీ వృక్షాలుగా మారి కాంక్రీట్ జంగల్లాంటి హైదరాబాద్‌కు ఊపిరి పోస్తున్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియన్లలో భారీ వృక్షాలు నగరానికే తలమానికంగా ఉన్నాయి. గత ప్రభుత్వాల ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కు చుట్టూ నాటిన వేలాది మొక్కలు నేడు మహావృక్షాలుగా మారి చల్లని నీడను ఇవ్వడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. అయితే కేబీఆర్ పార్కు చుట్టూ రేవంత్ సర్కార్ తలపెట్టిన అండర్‌పాస్‌ల నిర్మాణం, మల్టీ ఫ్లైఓవర్ల కోసం వేలాది చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేస్తుండడంతో పర్యావరణ ప్రియులు, కేబీఆర్ పార్కుకు వచ్చే సందర్శకులు, వాకర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని బసవతారకం క్యాన్సర్స్ ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ రోడ్డు మధ్యలో ఉన్న సెంట్రల్ మీడియన్లతో పాటు ఫుట్‌పాత్‌లపై ఉన్న భారీ వృక్షాలను నాలుగు రోజులుగా భారీ యంత్రాల సాయంతో నరికివేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 1500 వృక్షాలను తొలగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. వీటిలో 380 వృక్షాలను ట్రాన్స్ లోకేషన్ పేరుతో ఇతర ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ట్రాన్స్‌లోకేషన్ అనేది అత్యంత ఖరీదైన ప్రక్రియ కావడంతో కొన్ని వృక్షాలను మాత్రం ట్రాన్స్ లోకేషన్ చేస్తున్నట్లు చూపిస్తూ చాలా చెట్లను నరికివేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కళావిహీనంగా రహదారులు..
కేబీఆర్ పార్కు చుట్టూ జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియన్లలో వివిధ సైజులకు చెందిన సుమారు 4వేలకు పైగా చెట్లు ఉండగా వాటిలో కేవలం 1500 చెట్లకు మాత్రమే నెంబర్లు వేశారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చెబుతున్న లెక్కలకు, వాస్తవంగా నరికివేస్తున్న చెట్ల సంఖ్యలకు పొంతన లేదని పర్యావరణ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న వేలాది మొక్కల కారణంగా సమీపప్రాంతాల్లో చల్లదనం ఉంటుందని, ఈ రోడ్లుపై వెళ్తుంటే వాతావరణంలో మార్పు స్పష్టంగా తెలుస్తుందని, ఇలాంటి చెట్లను అండర్‌పాస్‌ల పేరుతో నిర్దాక్షిణ్యంగా నరికివేస్తున్నారని వారు మండిపడుతున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 12, రోడ్ నెం 2, రోడ్ నెం 10 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న రోడ్లను విస్తరించేందుకు ఎన్నో నెలల క్రితమే మార్కింగ్స్ చేసినా పనులు మాత్రం ప్రారంభించని అధికారులు పచ్చదనాన్ని పంచే వేలాది మొక్కలను నరికివేయడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ లోపల భారీ వృక్షాలు ఉండగా రాత్రికి రాత్రే వాటిని నరికివేశారు. దీంతో పీవీ విగ్రహం బోసిబోయి కనిపించింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాకా సెంట్రల్ మీడియన్‌లో ఉన్న చెట్లను ఆరునెలల క్రితమే సగం దాకా నరికివేసిన జీహెచ్ఎంసీ అధికారులు వాటిని గ్రూమింగ్ చేస్తున్నామని అప్పట్లో నమ్మబలికారు.
అయితే ఇటీవల ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో రోడ్డుకు మధ్యలో ఉన్న చెట్లను నరికివేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ నుంచి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రోడ్డు మధ్యలో సుమారు 1000 దాకా భారీ వృక్షాలుండగా వాటిని జేసీబీలు, హిటాచీల సాయంతో నేలకూల్చారు. దీంతో పాటు అగ్రసేన్ చౌరస్తానుంచి ఫిలింనగర్ రోడ్డులో సైతం భారీగా వృక్షాలను నరికివేయడంతో ఈ రోడ్లు మొత్తం కళావిహీనంగా మారాయి. ఎవరైనా తమ ఇంటిముందు ఉన్న చెట్టును నరికితే వేలాది రూపాయల జరిమానా విధించే అటవీశాఖ అధికారులు, అండర్‌పాస్‌ల పేరుతో లెక్కకు మించి జరుగుతున్న విధ్వంసం కళ్లముందు కనిపిస్తున్నా మౌనం వహిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
