కుత్బుల్లాపూర్, మే 28: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ బాలుడికి కరెంట్ షాక్ తగిలి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సుభాష్‌నగర్ డివిజన్ చివరి బస్టాప్ వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. అక్కడే ఆటో స్టాండ్ కూడా ఉన్నది. ఈ ప్రాంత ప్రజలు దాదాపు ఈ ప్రాంతం నుంచే రాకపోకలు కొనసాగిస్తారు. ఈ బస్టాపు సమీపంలోనే కంచెలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉన్నది. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన ఎనిమిదేండ్ల అబ్దుల్ రెహమాన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కంచె లేకుండా ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. అక్కడ వైర్లు కిందకు వేలాడుతున్నాయి. ఈ వైర్లు బాలుడి ముఖం, ఛాతిపైన తగలడంతో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి బాలుడిని హుటాహుటిన సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.