రోజురోజుకూ గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లోనే విచ్చలవిడిగా గంజాయి తాగుతూ పేట్రేగిపోతున్నారు. గంజాయి మూకను నియంత్రించాల్సిన పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పోలీసుల నిఘా, నిరంతర తనిఖీలు కొరవడటంతోనే గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతున్నది. పోలీసుల వైఫల్యంతో గంజాయి సేవిస్తూ యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాగా, గంజాయి మత్తులో ఇద్దరు యువకులు మహిళలపై దాడికి యత్నించడం కలకలం రేపింది.
– కుత్బుల్లాపూర్
సా యంత్రం ఎల్ఎన్బీనగర్ నడిరోడ్డుపై కాలనీకి చెందిన పవన్ కళ్యాణ్, సంఘీ గంజాయి సేవించి.. హల్చల్ సృష్టించారు. నడిరోడ్డుపై గంజాయి సేవించడమేంటని ప్రశ్నించిన ఓ మహిళపై దాడికి యత్నించారు. కాలనీవాసులంతా యువకులను జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ ఎదుట అదేరాత్రి ఆందోళనకు దిగారు.
గంజాయి బ్యాచ్‌ను తామే పట్టుకొచ్చి అప్పగించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వారి వైఫల్యానికి అద్దం పడుతున్నదని ఆరోపించారు. తమకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు గంజాయి సేవించేవారికి సహకరించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. కాగా, ఈ విషయంపై జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్‌ను వివరణ కోరగా.. గంజాయి సేవించిన యువకులపై రాత్రి కేసు నమోదు చేశామని తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీని కాలనీవాసులకు అందజేశామని చెప్పారు.