హైదరాబాద్ జిల్లా ఓటరు జాబితా ప్రక్షాళన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ నత్తనడకను తలపిస్తోంది. బోగస్ ఓట్ల ఏరివేత, తప్పుల సవరణే లక్ష్యంగా ప్రారంభమైన ఈ ‘మహా’ క్రతువు అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వం కారణంగా అభాసుపాలవుతోంది. గత నెల 25న ప్రారంభమైన ఈ ప్రక్రియ.. 14 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఓ కొలికి రాలేదంటే యంత్రాంగం ఎంత ‘లైట్’ తీసుకుందో అర్థమవుతోంది. జిల్లాలో సుమారు 47.36 లక్షల మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలతో పాటు ఫారం-6, 7, 8లను పంపిణీ చేయాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) కదలడం లేదు. దీంతో ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులు కాగితాలకే పరిమితమవుతున్నాయి.
– సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ)
గడువు ముగుస్తున్నా.. పెరగని వేగం
బీఎల్ఓల నిర్లక్ష్యం వల్ల తొలుత విధించిన గడువు కాస్తా ఈ నెల 7వ తేదీకి చేరింది. అప్పటికీ పని పూర్తి కాకపోవడంతో ఎన్నికల సంఘం తప్పని పరిస్థితిలో స్థితిలో ఈ నెల 11 వరకు గడువును పొడిగించాల్సి వచ్చింది. 12వ తేదీ నుంచి కేవలం పూర్తి చేసిన ఫారాలను మాత్రమే సేకరించి, 24 కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు రాలేదు. ముఖ్యంగా ముషీరాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఇప్పటికీ సగం మంది ఓటర్లకు ఫారాలే అందలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.
పేరుకే హెల్ప్ డెస్క్‌లు.. ఓటర్ల మండిపాటు
ఓటర్ల సందేహాలను తీర్చేందుకు, వారికి ఫారాలు పూరించడంలో సహాయం చేసేందుకు నగరంలోని 15 నియోజకవర్గాల్లో 15, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఒకటి చొప్పున మొత్తం 16 హెల్ప్ డెస్లను ఏర్పాటు చేశారు. కానీ, ఇవి కేవలం ‘హెల్స్ లెస్ డెస్లుగా మారాయని ఓటర్లు మండిపడుతున్నారు. ఈ డెస్లకు వెళ్తే అసలు ఫారాలే అందుబాటులో ఉండటం లేదు. ఒకవేళ ఫారాలు ఉన్నా.. సందేహాలను నివృత్తి చేసే నాథుడే కరువయ్యాడు. ముఖ్యంగా సర్ 2002 టెన్షన్ ఓటర్లను వెంటాడుతుంటే.. దానికి సంబంధించిన పాత ఓటరు వివరాలు ఎలా పొందాలో చెప్పే నాథుడే లేడు.
పొలిటికల్ ఏజెంట్లే దికు!
అధికార యంత్రాంగం చేతులెత్తేయడంతో ఓటర్లు ఇప్పుడు గత్యంతరం లేక వివిధ రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లను (బీఎల్ఏ)లను ఆశ్రయించాల్సి వస్తోంది. సిటీలోని 15 నియోజకవర్గాల్లోని 4062 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 10,901 మంది ఏజెంట్లు ఇప్పుడు ఓటర్లకు దికయ్యారు. రాజకీయ పార్టీల వద్ద దశాబ్దాల నాటి ఓటరు జాబితాలు అందుబాటులో ఉండటంతో, వారు సర్ 2002 వివరాలను సేకరించి ఓటర్లకు అందిస్తున్నారు. చాలా చోట్ల ఏజెంట్లే ఓటర్ల ఫారాలను పూరించి, ఫొటో డిక్లరేషన్‌తో సహా బీఎల్ఓలకు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ జీతాలు తీసుకునే బీఎల్ఓలు చేయాల్సిన పనిని రాజకీయ పార్టీలు చేస్తుండటంపై యంత్రాంగం తీరును ఓటర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

మా ఇంటికొచ్చి ఫారాలు పట్టుకెళ్లండి
ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో బీఎల్ఓలు ఇండ్లకు రావడం మానేసి.. ఓటర్లనే తమ ఇండ్లకు వచ్చి ఫారాలు పట్టుకెళ్లాలని, మళ్లీ పూర్తి చేసి తమ ఇంటికే తెచ్చివ్వాలని హుకూం జారీ చేస్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ దృష్టికి వెళ్లడంతో ఆయన బుధవారం నుంచి క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. ఫారాల పంపిణీలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై బీఎల్ఓలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.