జీడిమెట్ల, ఫిబ్రవరి 1: తాగి నోటికొచ్చినట్టల్లా తిడుతున్న సహచరుడిని నలుగురు కలిసి చంపేశారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ హత్య కేసును బాలానగర్ పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. షాపూర్‌నగర్‌లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీసీపీ కె.సురేశ్ కుమార్, బాలానగర్ ఏసీపీ హన్మంత్ రావు, బాలానగర్ సీఐ నర్సింహ రాజు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట అంబేద్కర్ నగర్ కు చెందిన కృష్ణగౌడ్ (39), గాజుల రామారానికి చెందిన ఆకుల కృష్ణ (42), సనత్‌నగర్‌కు చెందిన మాదరబోయిన రవి (39), గుర్రం నరేష్ (39), గంబు శంకర్ గౌడ్ (44) లు స్నేహితులు. ఈ ఐదుగురు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా కృష్ణగౌడ్‌కు కృష్ణ ముదిరాజ్ కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో కృష్ణ ముదిరాజ్ ఎక్కడ కలిసినా కృష్ణ గౌడ్ విపరీతంగా బూతులు తిడుతుంటాడు.
కృష్ణ ముదిరాజ్ తో మిగిలిన స్నేహితులను కూడా కృష్ణ గౌడ్ తాగి నోటికొచ్చినట్లుగా బూతులు తిడుతున్నాడు. కృష్ణగౌడ్ పీడను వదిలించుకుందామని మిగతా నలుగురు కలిసి పథకం రచించారు. ఇందులో భాగంగా జనవరి 29న కృష్ణగౌడ్ తో పాటు మిగతా నలుగురు కలిసి ఆటోలో మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ గుడికి వెళ్ళారు. అక్కడ ఐదుగురు కలిసి మద్యం సేవించారు. అదే రోజు రాత్రి తిరిగి వస్తూ నలుగురు కలిసి కృష్ణగౌడ్‌ను ఆటోలోనే తీవ్రంగా కొట్టారు. దెబ్బలు తాళలేక కృష్ణగౌడ్ బాలానగర్‌లోని కైటాన్ పరిశ్రమ ప్రాంతంలోని ఓ చోట విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సీసీ పుటేజీలను పరిశీలించారు. కృష్ణ ముదిరాజ్, రవి, నరేశ్, శంకర్ గౌడ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చేసిన నేరాన్ని వారు ఒప్పుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.