ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 9: సాహిత్యంతోనే సమాజ అస్తిత్వం ముడిపడి ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. విశ్వజనీన అంశాలపై పరిశోధకులు దృష్టి సారించాలని సూచించారు. సమాజ విచ్ఛిన్నానికి కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో 2వ తెలుగు సాహిత్య మహాసభ సోమవారం ప్రారంభమైంది. ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం లేకపోతే మనిషి మానవీయ గుణాల నుంచి దూరమవుతాడన్నారు. చరిత్ర, సామాజిక శాస్ర్తాలు స్థల, కాలాలను రికార్డు చేస్తాయి కానీ అస్తిత్వం, సంస్కృతి, భావోద్వేగాలను ప్రోత్సహించేది సాహిత్యమేనన్నారు. సాహిత్యం చాలా పవర్ ఫుల్ అని, అందెశ్రీ, గద్దర్ వంటి వారిని గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వారి సాహిత్యమే ఉపయోగపడిందని చెప్పారు.
సమాజ మూలాలను కనుగొంటూ మహాసభ కొత్త దృష్టికి వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు అన్ని రకాల సాహిత్యాలను చదవాలని, ఏదీ నిషిద్ధం కాకూడదన్నారు. గత కాలపు సాహిత్య పరిణామాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ తెలుగు కేవలం సంభాషణ భాష మాత్రమే కాదని, సంస్కృతి, జీవనశైలి అని అన్నారు. సాంకేతికతను వినియోగించి, తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయవచ్చని చెప్పారు. సినిమాలు, జానపదాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహాసభ డైరెక్టర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతకింది కాశీం, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ లావణ్య, గ్లోబల్ తెలుగు అసోసియేషన్ చైర్మెన్ కల్వల విశ్వేశ్వర్‌రెడ్డి, మహాసభ కన్వీనర్, ఓయూ తెలుగు విభాగం హెడ్ ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, డాక్టర్ రేమిళ్ల మూర్తి, డాక్టర్ రఘు, డాక్టర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.