హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలు, ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనపై నిలదీసిన పాపానికి నిరుద్యోగులను రాష్ట్ర సర్కార్ వేధిస్తున్నది. నిరుద్యోగ జేఏసీ నేతలను నిర్బంధించి వారి హక్కులను కాలరాస్తున్నది. రాష్ట్ర సర్కార్ తాజాగా విడుదల చేసిన పోలీస్ నోటిఫికేషన్‌ను 20 వేల ఉద్యోగాలతో తిరిగి ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు పోలీస్ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ గురువారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల కన్నీళ్లు మేధావులకు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. పలు డి మాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించా రు. పోలీస్ శాఖలో సుమారు 19వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారని, ప్రభుత్వం ఈ ఖాళీలను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం లో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలంటూ డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వచ్చేనెల 5న ‘హలో నిరుద్యోగి చలో అశోక్‌నగర్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ రోజు ఉదయం అశోక్‌నగర్ నుంచి ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో పలువురు నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనలో శంకర్‌నాయక్, నరేశ్, కిరణ్, బాలకోటి, రవియాదవ్, సవాయ్సింగ్, సురేశ్, గణేశ్, శ్రీనివాస్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.