హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వశాఖల్లో పారదర్శకత పెంచడం, ఉద్యోగుల సర్వీస్ వివరాలు, ఉద్యోగోన్నతులు, బదిలీలు, రిటైర్మెంట్ ప్రయోజనాలను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్ఆర్ఎంఎస్) పోర్టల్ నిర్వహణ రోజురోజుకూ ప్రహసనంగా మారుతున్నది. పంచాయతీరాజ్‌తోపాటు రాష్ట్ర ఉద్యోగుల సేవలు, రికార్డులను డిజిటలైజ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం, అవి అమలుకాకపోవడం పరిపాటిగా మారింది. 2019లోనే ప్రారంభమైన ఈ పోర్టల్ అప్డేషన్ కసరత్తు ఇన్ని సంవత్సరాలైనా కొలికి రావడం లేదు. తెలంగాణ ఆర్థికశాఖ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల (ఎస్ఆర్) డిజిటలైజేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్‌లో హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్‌ను ఈ ఏడాది మే 18న అందుబాటులోకి తెచ్చింది.
అన్ని శాఖల ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటల్ కాపీలను మే 31లోపు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా ఈ-పెన్షన్, ఈ-జీపీఎఫ్ వంటి విభాగాలు ప్రారంభించారు. జూనియర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, గ్రేడ్ 1 నుంచి 4 పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు వారి వివరాలను సర్వీస్ రిజిస్టర్ ఆధారంగా నమోదు చేసుకోవాలి. మండల, డివిజనల్, జిల్లా పంచాయతీ అధికారులు ఈ వివరాలను తనిఖీ చేయాలి. జిల్లా అధికారులు, డిప్యూటీ కమిషనర్లు పరిశీలించిన అనంతరం సిస్టమ్‌లో డాటాను లాక్ చేస్తారు. కానీ ఆచరణకు వచ్చేసరికి క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు, లాగిన్ అవరోధాలు, సర్వీస్ రికార్డుల్లో వ్యత్యాసాలు, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ సమగ్ర తనిఖీ వ్యవస్థ నత్తనడకన సాగుతున్నది.