హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : అధికారాన్ని అడ్డంపెట్టుకుని రెండున్నరేండ్లలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం రూ.50 వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని, ఇష్టారాజ్యంగా భూములు కొల్లగొడుతున్నదని, కంపెనీల పేరిట యథేచ్ఛగా ప్రజాధనాన్ని లూటీ చేస్తు న్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. ‘మ్యాక్స్‌బీన్ ఫార్మా.. మెడికవర్ దవాఖానల్లో సీఎం అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు వాటాలున్నయి.
2024 ఆగస్టులో దక్షిణ కొరియాలో హ్యుందాయ్ పెద్దలతో రేవంత్‌రెడ్డి కలిసిన నాలుగు నెలల తర్వాత ‘గీత’ ఆటోమోటివ్స్ పేరిట హైదరాబాద్‌లోని నార్సింగి, నాచారం, శంషాబాద్, వనస్థలిపురం, మెట్టుగూడలో ఐదు హ్యుందాయ్ షోరూంలు ప్రారంభమైనయ్. మైండ్వాల్ట్ నిర్మాణ సంస్థ ద్వారా సీఎం కూతురు నైమిషారెడ్డి కొంపల్లిలో ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నరు. భార్య, అల్లుడు, బిడ్డ కంపెనీలకు ముఖ్యమంత్రి ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నరు.
ఆయా కంపెనీల్లో రేవంత్‌రెడ్డి బినామీ దుంప శిరీష భాగస్వామిగా ఉన్నరు. మెడికవర్ హాస్పిటల్‌ను రూ.13,200 కోట్లకు విక్రయించి బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నరు’ అంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. కేసీఆర్ పాలనలో 80 నుంచి 90 శాతం పూర్తయిన టిమ్స్ హాస్పిటళ్లను ప్రారంభించని సీఎం రేవంత్‌రెడ్డి..తన అల్లుడు వాటాదారుగా ఉన్న మెడికవర్ దవాఖానలను మాత్రం దర్జాగా ప్రారంభించారని చురకలంటించారు. తన కూతురు ఏర్పాటు చేస్తున్న స్కూళ్ల కోసమే 27 వేల సర్కార్ బడులను 4 వేలకు కుదించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
మెడికవర్ మాతృసంస్థ సహృదయ హెల్త్‌కేర్ ఫైనాన్షియల్ పొటెన్షియల్ ఆదాయం 689 శాతం పెరగడంలోని ఆంతర్యమేందని ప్రశ్నించారు. శనివారం తెలంగాణభవన్‌లో క్రిశాంక్ విలేకరులతో మాట్లాడారు. మీడియాకు ఆధారాలు చూపి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు సాగిస్తున్న దోపిడీని బట్టబయలు చేశారు. పక్కా ఆధారాలు, అధికారిక డాక్యుమెంట్లను చూపించారు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఏ వేదికపైనైనా చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. ‘రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డి, అల్లుడు సత్యనారాయణ, బిడ్డ నైమిష ముందుకు వచ్చి నేను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే ఇదే నా చివరి ప్రెస్‌మీట్ అవుతుంది.. వారి కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్తా’నంటూ సవాల్ విసిరారు.

అఫిడవిట్ అంశాలతో డైవర్షన్
నీళ్ల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, ప్రజాసమస్యలు చర్చకు రాకుండా సీఎం పదిహేను రోజులుగా డైవర్షన్ డ్రామా నడుపుతున్నారని క్రిశాంక్ మండిపడ్డారు. ఆయన ఫ్యామిలీ సాగిస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకే ఇగో హర్ట్ అయిన ఆయన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌పై ఆక్రోశం వెళ్లగక్కారని విమర్శించారు. వారు అఫిడవిట్లలో పొందుపరిచిన వివరాలనే బయటపెట్టి వాస్కోడిగామాలా ఏదో అద్భుతాలు కనిపెట్టినట్టు బహిరంగ సభల్లో గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు..
‘కేటీఆర్ కిరాయి బంగ్లాలో హోటల్ నడుపుతున్నరు..2009 ఎన్నికల అఫిడవిట్లలో స్పష్టంగా చూపారు..ఇందులో తప్పేం ఉన్నది? కేసీఆర్, హరీశ్‌రావు పొలాలు కొనుక్కున్నరు’ అని వెల్లడించారు. వాటిని భూతద్దంలో చూపి ఆస్తులు పోగేసుకున్నారని ఆరోపణలు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిని ప్రశ్నించే సరికి సీఎం ఇగో హర్ట్ అయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ దవాఖానలు, పాఠశాలలు నిర్మించని రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యుల పేరిట ప్రైవేట్ దవాఖానలు, పాఠశాలలు నిర్మిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

కొంపల్లిలో కూతురు స్కూల్
సర్కార్ నిర్లక్ష్యంతో సౌకర్యాల్లేక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడులు, గురుకుల పాఠశాలలు మూతపడుతున్నాయని క్రిశాంక్ వాపోయారు. కానీ రేవంత్‌రెడ్డి కూతురు అనుముల నైమిషారెడ్డి మాత్రం మైండ్వాల్ట్ నిర్మాణ సంస్థ ద్వారా కొంపల్లిలోని సర్వేనంబర్ 87లో ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటో, డాక్యుమెంట్లను చూపుతూ సీఎం కూతురి అక్రమాలను ఎండగట్టారు. ఈ వ్యవహారంలో పురం సునీల్‌కుమార్‌రెడ్డి రిప్రజెంటేటర్‌గా ఉన్నారని ఆధారాలు బయటపెట్టారు. ‘రేవంత్‌రెడ్డీ..నీ కూతురి స్కూల్ కోసమే ప్రభుత్వ బడులను 27 వేల నుంచి 4 వేలకు తగ్గిస్తున్నరా?’ అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల పాలనలో ఒక్క దవాఖాన, ప్రభుత్వ పాఠశాల కూడా కట్టలేదని దుయ్యబట్టారు. కానీ వారి కుటుంబసభ్యులు మాత్రం ప్రైవేట్ దవాఖానలు, పాఠశాలలు పెట్టుకుంటున్నారని దెప్పిపొడిచారు.
అన్ని కంపెనీల్లో దుంప శిరీష పార్ట్నర్
సీఎం రేవంత్‌రెడ్డి అల్లుడు సత్యనారాయణకు చెందిన మ్యాక్స్‌బీన్ ఫార్మాలో, ఆయన భార్యకు చెందిన గీత ఆటోమోటివ్స్‌లో, కూతురు నిర్మిస్తున్న కొత్త కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్న మైండ్వాల్ట్లో దుంప శిరీష పార్ట్నర్గా ఉన్నారని క్రిశాంక్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన కంపెనీ మెయిల్ ఐడీ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ నుంచి తీసుకున్న పత్రాలను మీడియాకు చూపించారు. రేవంత్ అల్లుడు మొదట మొదలు పెట్టిన రొయ్యల వ్యాపారానికి చెందిన కామెరిన్ ఫుడ్స్‌లో సత్యనారాయణ, నైమిష వాటాదారులుగా ఉన్నారని ఆరోపించారు. సత్యనారాయణపై గతంలో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారని ఈడీ, ఐటీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడూ కూడా ఇతర రాష్ట్రాల్లోని బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నారని విమర్శించారు.

కేంద్రం విచారణ జరిపించాలి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం సాగిస్తున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలను రాష్ట్రపతి, ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, రాష్ట్రంలోని బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పక్ష నేతలకు పంపుతున్నామని క్రిశాంక్ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి అక్రమ వ్యవహారాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ సైతం విచారణకు సిద్ధపడి తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఎన్నికల అఫిడవిట్లలోని వివరాలను చూపుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌పై బహిరంగసభల్లో ఆరోపణలు చేస్తున్న రేవంత్‌రెడ్డి.. మరి భార్య, అన్నదమ్ములు, బిడ్డ, అల్లుడు సాగిస్తున్న అక్రమ దందాలపై ఆధారాలతో సహా బయపెట్టినా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ‘అక్రమాలను అంగీకరిస్తున్నరా? లేదంటే బయటకు రాకుండా బీఆర్ఎస్ నాయకులపై బురద జల్లుతున్నరా?’ అని సూటిగా ప్రశ్నించారు.
విచారణకు సిద్ధమా?
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
కుటుంబం సాగిస్తున్న అక్రమాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఈ అక్ర మాస్తులకు సంబంధించిన అన్ని ఆధారాలను రాష్ట్రపతి, ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాష్ట్రంలోని బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పక్ష నేతలకు పంపుతున్నం. రేవంత్ సైతం విచారణకు సిద్ధపడి తన నిజాయితీని నిరూపించుకోవాలి. ప్రతిపక్ష నేతలపై బురద చల్లే ముఖ్యమంత్రి.. తనపై వస్తున్న ఆరోపణ లపై మాత్రం ఎందుకు మాట్లాడటం లేదు?
– మీడియా సమావేశంలో మన్నె క్రిశాంక్
