హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): భారత స్పేస్‌టెక్ రంగానికి చెందిన స్టార్టప్‌ల విజయంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. స్పేస్ఎక్స్కు చెందిన ఫాలన్-9 రాకెట్ ద్వారా ధ్రువ స్పేస్, టేక్ మీ 2 స్పేస్, శాట్లియో ల్యాబ్స్, ఈవోఎన్ స్పేస్ ల్యాబ్స్‌కు చెందిన పేలోడ్లు విజయవంతంగా కక్ష్యలోకి చేరడంపై అభినందనలు తెలిపారు. భారత స్పేస్‌టెక్ ఎకోసిస్టమ్‌కు ఇది గర్వకారణమని శనివారం ఎక్స్‌వేదికగా ప్రశంసించారు. నాలుగు సంస్థల్లో మూడు తెలంగాణకు చెందిన స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో భాగమై ఉండటం రాష్ర్టానికి గర్వకారణమని తెలిపారు.
టీ హబ్, టీ వర్స్ వంటి సంస్థలు అందిస్తున్న మద్దతును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆవిషరణలు, మౌలిక సదుపాయాలు, స్టార్టప్‌లకు అనుకూలమైన ఎకోసిస్టమ్ కలిసొచ్చినప్పుడు ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ధ్రువ స్పేస్‌కు చెందిన లీప్-2 ప్లాట్‌ఫామ్‌పై శాట్లియో ల్యాబ్స్‌కు చెందిన టపాస్-1 థర్మల్ ఇమేజింగ్ పేలోడ్, టేక్ మీ 2 స్పేస్‌కు చెందిన ఎంవోఐ-1ఏ స్పేస్ క్రాఫ్ట్‌లో ఈవోఎన్ స్పేస్ ల్యాబ్స్‌కు చెందిన ఎంఐఆర్ఏ ఇమేజింగ్ సిస్టమ్ ప్రయాణించినట్టు తెలిపారు.