వ్యర్థాలతో 109 మెగావాట్ల విద్యుత్తు
ఇప్పటికే జవహర్‌నగర్‌లో 20మెగావాట్లు ఉత్పత్తి
సెప్టెంబర్‌లో దుండిగల్‌లో 14.5 మెగావాట్లు ప్లాంటు ప్రారంభం
పనులు శరవేగంగా జరుగుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారుల వెల్లడి
విడతల వారీగా ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువస్తున్న అధికారులు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 ( నమస్తే తెలంగాణ ) : పెరుగుతున్న జనాభాకనుగుణంగా గ్రేటర్లో చెత్త ఏటా అధికంగా పోగవుతోంది. దీన్ని ఎప్పటికప్పుడు చిన్న,భారీ వాహనాల ద్వారా జవహర్‌నగర్ డంపుయార్డుకు తరలిస్తున్నది బల్దియా. ఇలా సేకరించిన చెత్త నుంచి ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా 20 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో మరో 5 కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, దుండిగల్‌లో నిర్మిస్తున్న 14.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంటు సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే వీలుంది. మొత్తం ఆరు కేంద్రాల ద్వారా రెండేండ్లలో 109 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బల్దియా అధికారులు వెల్లడించారు.
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులు మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. గ్రేటర్లో ఉత్పత్తయ్యే వ్యర్థాలను భస్మం చేసి.. విద్యుత్‌ను సృష్టించి అదనపు విద్యుత్ ఉత్పత్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా 100 మెగా వాట్లకుపైగా విద్యుత్ ఉత్పత్తిని సాకారం చేసేందుకు కేంద్రాలను నెలకొల్పుతున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో 20మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు సేవలందిస్తుండగా.. ఇదే తరహాలో చెత్తను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేసే మరో ఐదు కేంద్రాలను రాబోయే రెండేండ్లలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే దుండిగల్‌లో 15 మెగా వాట్ల విద్యుదుత్పత్తి ప్లాంటు పనులు చకచక జరుగుతున్నాయని, వచ్చే సెప్టెంబర్ నెలలో ఈ ప్లాంటును అందుబాటులోకి తీసుకువస్తామని శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
ప్రతి రోజు వెయ్యి టన్నులు..
ప్రతి రోజు 1000 టన్నుల వ్యర్థాలను మండించి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. వ్యర్థం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చెత్తను దుండిగల్ పరిసర ప్రాంతాల నుంచి, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వ్యర్థాలను తరలించనున్నారు. దీంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై కొద్ది భారం తగ్గే అవకాశం ఉంది.
రోజుకు 7వేల టన్నుల చెత్త ఉత్పత్తి
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం రోజుకు 7వేల టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతున్నది. రాబోయే ఐదేండ్లలో ఆది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఉత్పత్తయ్యే చెత్తంతా ప్రస్తుతం శామీర్‌పేట మార్గంలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగా జవహర్‌నగర్‌లో 20 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రం సేవలు మొదలయ్యాయి. ఇక్కడ ఉత్పత్తయ్యే కరెంట్ పక్కనున్న మల్కారం విద్యుత్తు ఉపకేంద్రం ద్వారా ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ గ్రిడ్‌కు సరఫరా అవుతున్నది. ఫలితాలు బాగుండటంతో మిగతా కేంద్రాలపై ముమ్మరంగా దృష్టి సారించి చర్యలు చేపట్టారు. కాగా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ఫర్ పాయింట్స్ (SCTP) నుంచి వ్యర్థాలను జవహర్‌నగర్ డంప్ యార్డుకు తరలిస్తారు. తరలించిన వెంటనే అకడ యాంత్రికంగా విభజించి ఆ తర్వాత మండే గుణం గల వ్యర్థాలను వేరు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.