సిటీబ్యూరో, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాబాట కార్యక్రమం విమర్శలకు మూలమైంది. గత సంవత్సరం నవంబర్ 5న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సీఎండీ నుంచి ఆర్టిజన్ స్థాయి వరకు అధికారులు, సిబ్బంది నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నెట్వర్క్ తనిఖీలు చేస్తున్నారు. సెక్షన్ల వారీగా ప్రజాబాటలో రెండు బృందాలు పాల్గొంటాయి. వీరు తమ సెక్షన్ల పరిధిలో మూడు నుంచి నాలుగు డీటీఆర్లను పరిశీలించడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ బాక్సులను తనిఖీ చేస్తారు.
అయితే వినియోగదారుల నుంచి విద్యుత్ సరఫరా మెరుగు కోసం సలహాలు స్వీకరిస్తూనే వారి నుంచి ఫిర్యాదులు తీసుకున్న తర్వాత మళ్లీ అటువైపు కూడా చూడడం లేదన్న చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా సమస్యలు పరిష్కరిస్తామంటూ బస్తీల బాట పట్టిన అధికారులు కొంతసేపు మాత్రమే అక్కడ ఉండి ఫిర్యాదుల స్వీకరణకే పరిమితమవుతున్నారు తప్ప వాటిని పరిష్కరించడంలో మాత్రం విఫలమయ్యారంటూ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా 11కేవీ, 33కేవీ లైన్లు కిందకు ఉన్నాయని, ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయని, స్తంభాలు ఒరిగిపోయాయనేవి ఉన్నాయి. అంతేకాకుండా లూజ్‌వైర్లు, స్తంభాలపై కుప్పలుగా వైర్లు, లోఓల్టేజి సమస్యలు కూడా ఉండగా కొన్ని సమస్యలను సెక్షన్ కాంట్రాక్టర్లతో సరిదిద్దవచ్చు. ప్రజాబాటలో భాగంగా ఉన్నతాధికారులు విద్యుత్ సమస్యలు తెలుసుకునే క్రమంలో 11కేవీ లైన్లు, డీటీఆర్ స్ట్రక్చర్లు, ఎల్టీలైన్లలోని లోపాలను అక్కడికక్కడే గుర్తించి సరిదిద్దాలి. లేదా 24గంటల్లో క్లియర్ చేయాలి. కరెంట్ పోవడానికి కారణమైన ట్రిప్పింగ్ ఫీడర్లలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలి.
లోడ్ బ్యాలెన్స్, ఫీడర్ విభజన, పగిలిపోయిన ఇన్సులేటర్లు, సక్రమంగా లేని జంపర్లను సరిచేయాలి. వివిధ కారణాలతో వంగిపోయిన కరెంట్ పోల్స్, రెక్టిఫికేషన్లో లెవల్ రోడ్ క్రాసింగ్లను గుర్తించి వెంటనే సరిచేయాలి. అనవసర ఎల్సీలను నివారించడానికి ఏబీ స్విచ్‌లను ఏర్పాటు చేయాలి. లైన్లలో కెపాసిటర్లను పెట్టడం, ఎల్టీ లూజ్లైన్లను స్ట్రింగ్ చేయడం, అవసరం మేర డీటీఆర్ సామర్థ్యం పెంపు వంటివి వెనువెంటనే చేయడం ద్వారా వేసవికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఈ మూడు నెలల క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా తెలుస్తోంది.
కొన్ని సెక్షన్లలో ఇప్పటికే పనులు ఎక్కువగా ఉండగా.. ప్రజాబాటలో వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్ సరిపోవడం లేదని, మెటీరియల్ లేదని వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలిసింది. అయితే ప్రజాబాట పనులతో పాటు గతంలో చేపట్టిన పనులు లెక్కలు కట్టి బిల్లులు ఇచ్చే క్రమంలో కొన్ని సర్కిళ్లలో సెక్షన్ కాంట్రాక్టర్లకు , సిబ్బందికి మధ్య వాటాల గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని పనులు సదరు గొడవపడిన కాంట్రాక్టర్లతో చేయించకుండా వేరొకరికి ఇవ్వకుండా పెండింగ్ పెట్టి వినియోగదారులకు ఏం సమాధానం చెప్పకుండా వాయిదా వేస్తున్నట్లు సమాచారం. చిన్నచిన్న పనులు చేయాల్సిన చోట కూడా కమీషన్ల వ్యవహారంతో సిబ్బంది, అధికారుల జోక్యంతో జాప్యం పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
సమస్యల పరిష్కారానికి వెళ్తున్న సిబ్బందికి ఎదురవుతున్న అసలు సమస్య మెటీరియలే. కేబుల్స్, ఎల్టీ ఫ్యూజులు, బుష్రాడ్స్, జాయింటర్ లగ్స్, స్పేసర్స్ వంటి కనీస మెటీరియల్ సైప్లె లేకపోవడంతో మరమ్మతులు చేయడం కష్టంగా ఉన్నదని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. నగరంలోని బస్తీ ప్రాంతాల్లో గల్లీల్లో లూజ్‌గా ఉన్న వైర్ల సమస్య తీరాలంటే స్పేసర్స్ లేవని, ఆయిల్ లీక్ అవుతున్నా పట్టించుకునే పరిస్థితే లేదంటూ మెటీరియల్ లేకుండా బస్తీబాటలో వచ్చిన ఫిర్యాదులు ఎలా పరిష్కరించాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల పర్యటనలు కేవలం మొక్కుబడిగానే ఉన్నాయంటూ క్షేత్రస్థాయిలోకి వచ్చిన అధికారులు సమస్యలు వినడం కంటే తాము అక్కడికి వెళ్లి వచ్చామని ఉన్నతాధికారులకు చెప్పుకునేందుకు రెండుమూడు ఫొటోలు, సెల్ఫీలతో హంగామా చేయడం తప్ప ఫిర్యాదుల పరిష్కారం దిశగా అడుగు వేయడమే లేదని చర్చించుకుంటున్నారు. అసలు ఈ కార్యక్రమానికి బడ్జెట్ లేకుండానే బస్తీబాట అంటూ హడావిడి చేస్తున్నారని, ప్రజల దగ్గరకు వెళ్తే వారు అడుగుతున్న కొత్త లైన్లు, పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు అడిగితే వాటికి తమ వద్ద సమాధానం లేదని చెబుతున్నారు.
అయితే నగరంలోని పలు బస్తీల్లో 630 కిమీల మేర 70చమిమీల కేబుల్ స్థానంలో ఓవర్‌హెడ్ లైన్ వేశామని, 760 ఇనుప స్తంభాలను తీసేసి సిమెంట్ స్తంభాలు వేశామని, 1100 డీటీఆర్లను మార్చినట్లు డిస్కం అధికారులు చెప్పారు. అయితే ఇవన్నీ లెక్కలకే తప్ప వచ్చిన ఫిర్యాదులెన్ని, పరిష్కరించినవి ఎన్ని, వాటిలో ఇంకా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు, అందుకు కావలసిన మెటీరియల్‌పై మాత్రం ఉన్నతాధికారులు నోరు విప్పడం లేదు.
ఎప్పటికప్పుడు సెక్షన్ల వారీగా ఫిర్యాదులు వస్తాయని , వాటిని అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నామని ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఒకరు చెప్పారు. కొన్ని డీటీఆర్లు, లైన్ల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పరిష్కరించే అంశం వారి చేతిలో ఉంటుందని, కావలసిన మెటీరియల్ ఇస్తే పనులు త్వరగా పూర్తవుతాయని, కానీ డిస్కం స్టోర్స్‌లో మెటీరియల్ కొరత ఉన్నదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.