తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీజీ సాక్స్)లో అధికారుల నిర్లక్ష్యం అటు రోగుల పాలిట, ఇటు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. రూ.10 లక్షలు ఖర్చు చేసి, ఆయా విభాగాలకు చెందిన కీలక పోస్టులకు ఆర్భాటంగా పరీక్షలు నిర్వహించిన సాక్స్ అధికారులు ఏడాది కావస్తున్నా వాటి ఫలితాలను వెల్లడించకపోవడంతో సిబ్బంది కొరత కారణంగా సరైన వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో పక్క ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన నిరుద్యోగులు ఫలితాల కోసం సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. పరిపాలనా అంశాలపై సాక్స్ పీడీ సరైన దృష్టి పెట్టకపోవడం, కీలక వ్యవహారాలన్నీ ఎన్హెచ్ఎంకు చెందిన ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ కనుసన్నలో నడవడంతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, సాక్స్ ప్రోగామ్ల నిర్వహణ తదితర అంశాలన్నీ గాడి తప్పుతున్నాయనే
ఆరోపణలు వినిపిస్తున్నాయి. – సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ)
హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్ధేశ్యంతో అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన చికిత్స, హెచ్ఐవీ రోగుల సంఖ్య పెరగకుండా నియంత్రించడం, రోగులకు కౌన్సిలింగ్ నిర్వహించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు తదితర అత్యంత కీలక కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించేందుకు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(న్యాకో) పలు పోస్టులను మంజూరు చేసింది. అందులో గత కొంత కాలంగా 10 కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ 2025 జూలై 31న నోటిఫికేషన్ జారీచేసింది. అందులో డిప్యూటి డైరెక్టర్(ఎస్ఐ)-1, డిప్యూటి డైరెక్టర్ ప్రివెన్షన్-1, అసిస్టెంట్ డైరెక్టర్ (ఎస్ఐ)-1, అసిస్టెంట్ డైరెక్టర్ బిఎస్డి)-1, దిశ/డిఎపిసియుకు సంబంధించి క్లినికల్ సర్వీస్ ఆఫీసర్స్-3, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ -1, డేటా మానిటరింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫీసర్-2 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. అయితే ఈ పోస్టులను రాత పరీక్షల ఆధారంగా భర్తీచేయాలని నిర్ణయించిన సాక్స్ అధికారులు పరీక్షల నిర్వహణ బాధ్యతలను రూ.10లక్షలు ఖర్చుచేసి జేఎన్టియూకు అప్పగించారు. టీజీ సాక్స్ విజ్ఞప్తి మేరకు జెఎన్టీయూ 2025, అక్టోబర్ 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించింది. కేవలం 10పోస్టులకు సంబంధించిన ఈ పరీక్షలకు వెయ్యిమంది నిరుద్యోగులు హాజరయ్యారు.
పరీక్షలు పెట్టి ఏడాది కావస్తున్నా..
పరీక్షలు నిర్వహించి దాదాపు సంవత్సర కావస్తున్నా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు పరీక్షా ఫలితాలను వెల్లడించకపోవడంపై అటు పరీక్షలు రాసిన నిరుద్యోగులు, సిబ్బంది కొరతతో ఇటు రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించిన వారం రోజులకే జేఎన్టీయూ అధికారులు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసి, టీజీ సాక్స్ అధికారులకు ఫలితాలను సీల్డ్ కవర్లో అందచేసినట్లు సమాచారం. కాని టీజీ సాక్స్ పరిపాలనాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ ఫలితాలు బీరువాలోనే మగ్గుతున్నాయని, వాటిని విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేసే తీరిక టీజీ సాక్స్ పీడీకి దొరకడం లేదని పరీక్షలు రాసిన నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీజీ సాక్స్ పీడీ స్పందించి, పరీక్షా ఫలితాలను విడుదల చేసి, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.