GHMC | జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపునకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కాగా, పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేశారు
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రభాకర్ వాదించారు. డీలిమిటేషన్ మ్యాప్‌ను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పునర్విభజనపై సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపారు. జనాభా, సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా పునర్విభజన మ్యాప్‌ను హైకోర్టుకు సమర్పించామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తెలిపారు. నియోజకవర్గం మారకుండానే వార్డుల విభజన జరిగిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏజీపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది. డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఏజీ.. డీలిమిటేషన్‌పై కోర్టు జోక్యం ఉండకూడదని తెలిపారు. కాగా, డీలిమిటేషన్ ప్రక్రియలో అనుమానాలు ఉన్నప్పుడు జ్యుడీషియల్ రివ్యూ చేయవచ్చని పిటిషనర్ల తరఫు లాయర్ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. మరికాసేపట్లో తీర్పును వెలువరించనుంది.