రంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ) : అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఉన్న ఆంక్షలను వాహన దారులు లెక్కచేయకపోవటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓఆర్ఆర్పై ఏ వాహనం ఏ లేన్‌లో వెల్లాలి…ఏ వెహికిల్ ఎంత వేగంతో వెళ్లాలో కచ్చితమైన నిబంధన ఉన్నది. అలాగే, కార్లు వంద నుంచి 120 కిలోమీటర్ల స్పీడు.. లారీలు, భారీ వాహనాలైతే 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉంటుంది. కానీ చాలామంది తమకు కేటాయించిన లేన్లలో వెళ్లకుండా గీత దాటి మరో వరుసలోకి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఓఆర్ఆర్పై వాహనాలను నిలపొద్దని నిబంధన ఉన్నా.. కొందరు వెహికిల్స్ నిలపడం.. అది గమనించక వాహనదారులు అతివేగంగా వచ్చి ఆగి ఉన్న వాహనాలను ఢీకొని దుర్మరణం పాలవుతున్నారు. ముఖ్యంగా అవుటర్‌రింగ్ రోడ్డుపై ఒకవైపు నాలుగు లేన్ల వరుసలున్నాయి. నిబంధనల ప్రకారం ఒకటి, రెండు లేన్లలో కార్లు, మూడు, నాలుగు వరుసల్లో లారీలు, ఇతర భారీ వాహనాలు మాత్రమే ప్రయాణించాలి. కానీ, ఈ నిబంధనలు అతిక్రమిస్తున్న క్రమంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. దీనికి తోడు అతివేగం, నిర్లక్ష్యంగా వాహ నాలను నడపటం కూడా యాక్సిడెంట్లకు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా, ఎగ్జిట్ నంబర్ 12 నుంచి 16 వరకు బొంగుళూరు నుంచి శంషాబాద్‌ల మధ్య ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. గత వారం రోజుల్లో పదిమంది వరకు మృత్యువాతపడ్డారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవటం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజుల్లో పదిమంది మృతి
అవుటర్‌రింగ్ రోడ్డుపై గతవారం రోజుల్లో ఎగ్జిట్ 12 నుంచి 16 మధ్య జరిగిన మూడు ప్రమాదాల్లో పదిమంది వరకు మృత్యువాత పడ్డారు. అతివేగం, అజాగ్రత్తగా వాహనాలను నడపడంతోనే ఈ ప్రమాదాలు జరిగినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఇటీవల కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెం దిన ఓ కుటుంబం యాదగిరిగుట్ట నరసింహ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న క్ర మంలో వారి కారు పెద్దగోల్కొండ అవుటర్‌పై ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొంది.
ఈ ప్రమాదంలో కుటుంబంలోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారికి కేటాయించిన లేన్‌ను డ్రైవర్ పాటించక పోవటమే ఈ యాక్సిడెంట్‌కు కారణమని పోలీసులు తేల్చారు. అలాగే, పెద్దఅంబర్‌పేట అవుటర్ రింగ్‌రోడ్డు నుంచి శంషాబాద్ వైపు కారులో నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు వెళ్తుండగా.. తెల్లవారుజామున అవుటర్‌పై ముందుగా వెళ్తు న్న కంటైనర్‌ను గుర్తించలేక వెనుక నుంచి బలంగా ఢీకొన్నారు. ఈ ఘటనలో కారు లో ఉన్న భరత్‌కాంత్, త్రిలోక్ అనే యువకులు మృతి చెందారు.
వీరు సినీ పరిశ్రమలో అవకాశం కోసం పదేండ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి నానక్‌రాంగూడలో నివాస ముంటున్నారు. భరత్‌కాంత్ ఇటీవలే సినిమాల్లో వర్ధమాన హీరోగా నటిస్తూ చిన్నచిన్న పాత్రలు చేస్తున్నాడు. త్రిలోక్ సినిమాల్లో కెమెరామన్‌గా పనిచేస్తున్నాడు. వీరు ప్రయాణిస్తున్న కారు తమ లేన్‌ను దాటి మరో వరుసకెళ్లి కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పెద్దఅంబర్‌పేట అవుటర్ నుంచి తుక్కుగూడ వైపు కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అవుటర్‌పై చెట్లకు నీరు పోస్తున్న ట్రాక్టర్ ను గమనించక అతివేగంగా వచ్చి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు రోజుకోచోట జరుగుతున్నా అధికారులు మాత్రం రోడ్డు భద్రత చర్యలు తీసుకోవడంలేదని వాహనదారులు మండిపడుతున్నారు.

లక్షలాది వాహనాల రాకపోకలు
అవుటర్‌రింగ్ రోడ్డు దాదాపుగా 158 కిలోమీటర్ల వరకు ఉన్నది. ఈ రోడ్డుపై ప్రతిరోజూ లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎక్కువ మందికి ఏయే లేన్లలో ప్రయాణించాలో సరిగ్గా తెలియదు. దీంతో తమకు కేటాయించిన వరుసలో కాకుండా మరో లేన్‌లోకి వెళ్తుండటంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు అర్ధరాత్రి దాటాక ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే భారీ వాహన డ్రైవర్లు అవగాహన లోపంతో రోడ్డు పక్కనే వాటిని నిలుపుతున్నారు. అతివేగంతో వచ్చే వాహనాలు ఆగి ఉన్న వాహనాలను గుర్తించలేక ఢీకొట్టి మృత్యువాత పడుతున్నారు.
కనిపించని పెట్రోల్ మొబైల్ వాహనాలు..
అవుటర్‌పై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా వాటిని అరికట్టడంతోపాటు ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు ఉండాల్సిన పెట్రోల్ మొబైల్స్ ఎక్కడా కనిపించ టంలేదు. ఓఆర్ఆర్పై పలుచోట్ల స్పీడ్‌గన్స్ ఏర్పాటు చేసినా వాహనదారులు వాటిని లెక్కచేయకుండా మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసి ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.