తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 3: తెలుగు భాషా సాహిత్య కళారంగాలను కాపాడుకునే దిశగాఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయం రాను రాను తన ప్రభను కోల్పోతున్నదని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అసహనం వ్యక్తం చేశారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన 2023 సంవత్సరానికి గాను కీర్తి పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటేశం మాట్లాడుతూ..భాషా సాహిత్య లలిత కళల రంగాల కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల సంఖ్యను పెంచేదిశగా వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య నిత్యానందరావు ప్రయత్నించాలని సూచించారు.
ప్రపంచంలోని మొదటి 15 భాషలలో తెలుగు నిలుస్తుందన్నారు. అశ్విని గ్రూప్ చైర్మన్ బి.సి.వి సుబ్బారావు ప్రసంగిస్తూ.. సాహిత్యం, కళా ప్రక్రియల ద్వారా సమాజాన్ని చైతన్యం చేస్తున్న ప్రతిభామూర్తులను గుర్తించి పురస్కారాలను అందించడం హర్షణీయమన్నారు. తన వంతుగా తెలుగు వర్సిటీకి రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య నిత్యానందరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, విస్తరణ సేవా విభాగం అసిస్టెంట్ డైరక్టర్ రింగు రామ్మూర్తి పాల్గొన్నారు.
కీర్తి పురస్కారాలను డాక్టర్ అయ్యగారి సీతారత్నం(మహిళాభ్యుదయం), హెచ్.హేమావతి(లలిత సంగీతం), రామలక్ష్మీ రంగాచార్య(శాస్త్రీయ సంగీత విద్యాంసురాలు), కుమారి మంగ్లీ(జానపద గాయకులు), పద్మాలయ ఆచార్య(జానపద కళలు), పొత్తూరి సుబ్బారావు(పత్రికా రచన), హిమజ మంగారి(ఉత్తమ రచయిత్రి), ఆచార్య వెలగోలు నాగరాజ్యలక్ష్మి(ఉత్తమ రచయిత్రి), కె. మంగాదేవి(ఉత్తమ నటి), పి. వెంకటేశ్వరరావు(ఉత్తమ నటుడు),
డాక్టర్ చింతోజు మల్లికార్జునాచారి(పద్యరచన), జె. రతన్‌కుమార్(ఆంధ్రనాట్యం), వై.వి రామ్మోహన చలపతి శాస్త్రి(కూచిపూడి నృత్యం), పాలకుర్తి రామమూర్తి(వ్యక్తిత్వ వికాసం), చెగిరెడ్డి చంద్రశేఖర రెడ్డి(హేతువాద ప్రచారంలో కృషి), ఆచార్య సి.మురళీకృష్ణ(గంథాలయసమాచార విజ్ఞానం),కె.సుధాకర్ గౌడ్(గ్రంథాలయకర్త), వి.ఎస్ రాజ్యలక్ష్మి(సాంస్కృతిక సంస్థానిర్వహణ), డాక్టర్ ఎస్.మ నోహర్‌రావు(ఇంద్రజాలం), షేక్ సుభాని(కార్టూనిస్ట్), పండితారాధ్యుల వీరేశలింగం(జ్యోతిష్యం), పాతూరి మహేందర్‌రెడ్డి(ఉత్తమ ఉపాధ్యాయులు),కంది నరసింహులు(చిత్రలేఖనం ),పిల్లిట్ల ముకుందం(జానపద కళలు)లకు ఒక్కొక్కరికి రూ5,116ల నగదు, శాలువా, అభినందన పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.