సీఎం క్రికెట్ కప్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, జూన్ 2, ఆట ప్రతినిధి : జీవితాలను గుల్ల చేస్తున్న మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రాష్ట్ర క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ‘సే నో టూ డ్రగ్స్’ ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకొని గురువారం ఎల్బీ స్టేడియంలో ‘సీఎం క్రికెట్ కప్’ అట్టహాసంగా మొదలైంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా సే నో టూ డ్రగ్స్ ప్రచారంలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు.
ఈ పోటీల్లో ప్రింట్మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టీజీవో, టీఎన్జీవో, హైదరాబాద్ సిటీ పోలీస్, స్టేట్ సివిల్ సర్వీసెస్, డాక్టర్స్, సెలబ్రిటీస్ కలిపి మొత్తం ఎనిమిది జట్లు పోటీపడుతున్నట్లు పేర్కొన్నారు. టోర్నీలో పాల్గొంటున్న ప్లెయర్లతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, స్టార్ షూటర్ ఇషాసింగ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, టీజీవో అధ్యక్షురాలు మమత, తదితరులు పాల్గొన్నారు.
ఇషా వర్సెస్ మినిస్టర్

‘సే నో టు డ్రగ్స్’ నినాదానికి మద్దతుగా శాట్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా షూటింగ్ గోల్డ్‌మెడల్ విజేత ఇషాసింగ్తో మంత్రి సరదాగా క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు.