సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన ‘కోర్ అర్బన్ రీజియన్’ (క్యూర్ 2026) ముసాయిదా బిల్లుపై చర్చనీయాంశంగా మా రింది. ఏడు దశాబ్దాల పాత జీహెచ్ ఎంసీ చట్టం స్థానంలో ప్రతిపాదించిన ఈ బిల్లులోని పలు అంశాలపై నిపుణులు, పౌర సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య వికేంద్రీకరణను తుంగలో తొకు తూ, ప్రజలపై పన్నుల భారం మోపేలా, రాజ్యాం గ నిబంధనలకు విరుద్ధంగా ఈ ముసాయిదా ఉందంటూ ప్రముఖ నిపుణులు డా. దొంతి నరసింహారెడ్డి గురువారం సమగ్ర నివేదికను మీడియాకు విడుదల చేశారు. ఈ ‘క్యూర్’ ముసాయిదాలోని ప్రధాన లోపాలు, సవరించాల్సిన కీలక అంశాలను ఇందులో ప్రస్తావించారు.
ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ఎకడ?
బిల్లులో అట్టడుగు ప్రజాస్వామ్య వేదికలైన వార్డు కమిటీల కోసం ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. వార్డు స్థాయి బడ్జెట్ ప్రతిపాదనలలో, కార్పొరేషన్ ఖర్చుల పర్యవేక్షణలో వార్డు కమిటీలకు ఒక నిర్ధిష్టమైన పాత్రను కల్పించాలి. కమిటీలు లేవనెత్తిన సమస్యలపై కార్పొరేషన్ కచ్చితంగా స్పందించేలా ఒక తప్పనిసరి ‘ప్రతిస్పందన యంత్రాంగం’ ఉండాలి. కమిటీల కూర్పు, వాటిలో నామినేటెడ్ సభ్యుల అర్థం, ప్రతి వార్డుకు నాలుగు కమిటీల ఏర్పాటుపై బిల్లులో స్పష్టత కొరవడింది.
ప్రజలపై ‘మూలధన విలువ’ పన్నుల భారం!
పాత వార్షిక అద్దె విలువ (ఏఆర్వీ) స్థానంలో కొత్తగా ప్రతిపాదించిన మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానంతో ప్రజలపై పన్నుల భారం రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. సెక్షన్ 3, 237, 238, 240 కింద సరిహద్దు మార్పులు, టారీఫ్ సవరణలు లేదా ఫీజు మినహాయింపులను ఖరారు చేసే ముందు.. సంబంధిత కార్పొరేషన్లకు ముందస్తు నోటీసులు ఇవ్వాలి. ప్రజల అభ్యంతరాలను నమోదు చేయడానికి పూర్తి అవకాశం కల్పించేలా బిల్లును సవరించాలి. అలాగే క్యాపిటల్ డెవలప్మెంట్ చార్జీల ప్రత్యేక ఖాతా పర్యవేక్షణకు ఒక స్వతంత్ర రిపోర్టింగ్యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడ్ఈ ప్రకారం ప్రతి మెట్రోపాలిటన్ నగరానికి ‘మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ’ని ఏర్పాటు చేయాలనే రాజ్యాంగబద్ధ బాధ్యత ఉంది. కానీ, ఈ బిల్లులో దానికి, ప్రభుత్వ ప్రతిపాదిత వ్యవస్థలకు ఉన్న సంబంధాన్ని స్పష్టం చేయలేదు. ఎంపీసీకి ప్రత్యామ్నాయంగా కాకుండా, దానిపై ఆధారపడేలా సమన్వయ యంత్రాంగాన్ని నిర్ధారించాలి. సైబరాబాద్, మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ‘క్యూర్’ పరిధిలోకి చేర్చడానికి గల రాజ్యాంగ, చట్టబద్ధమైన ఆధారాలను బిల్లులో స్పష్టంగా పేరొనాలి.
‘హైడ్రా’ చట్టబద్ధతపై స్పష్టత కరువు
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా ఏర్పాటును బిల్లులో గుర్తించినప్పటికీ, దాని అమలుకు ముందే హైడ్రా తీసుకున్న చర్యల చట్టబద్ధత ఏమిటనే దానిపై స్పష్టత లేదు. దీనికి అనుగుణంగా సెక్షన్ 241(1)ని తిరిగి రూపొందించాలి. క్యూర్ పరిధిలోని అగ్నిమాపక భద్రత తనిఖీ, ఆడిట్ బాధ్యతలను తెలంగాణ అగ్నిమాపక సేవల చట్టం-1999 ప్రకారం హైడ్రాకు, అగ్నిమాపక శాఖకు మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా నిర్దేశించాలి.
గందరగోళంలో ‘కమిషనర్’ పదవీ నిబంధనలు!
బిల్లులో దాదాపు 600 సార్లు కమిషనర్ అనే పదాన్ని ప్రస్తావించినప్పటికీ, ఏ కమిషనర్ గురించి మాట్లాడుతున్నారో కమిషనరా? లేక కొత్త కార్పొరేషన్ల కమిషనర్లా? ఎకడా స్పష్టత లేదు. క్యూర్ పరిధిలో పనిచేస్తున్న అనేక కమిషనర్-నియమిత కార్యాలయాలలో ఏది ఉద్దేశించబడిందో స్పష్టం చేస్తూ ఒక ‘ముసాయిదా నియమావళి’ని బిల్లు ప్రారంభంలోనే చేర్చాలి.
రియల్కు శరాఘాతం
సెక్షన్ 70(3) కింద జీఎస్టీ (జీఎస్టీ) పరిధికి వెలుపల ఉన్న అంశాలకే పరిమితం చేసేలా సవరించాలి. భవనాల నిర్మాణ విలువల నుంచి భూమి, నిర్మాణ భాగాలను వేరు చేసేలా సవరణలు లేకుంటే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుంది. బిల్లులోని రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ నిబంధనలు బదిలీ చేయదగిన అభివృద్ధి హకులను స్పష్టంగా ప్రస్తావించాలి. దీని ద్వారా వచ్చే రెవెన్యూ పారదర్శకంగా ఉండేలా చూడాలి. సెక్షన్ 94లో అక్రమ నిర్మాణాలకు కేవలం ఆస్తి పన్ను రూపంలో కాకుండా, కఠినమైన జరిమానాలతో ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి.
అపరిమిత అధికారాలు!
బిల్లులో ప్రభుత్వమని అనేకసార్లు ప్రస్తావించడం ద్వారా స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా మితిమీరిన విచక్షణాధికారాలను ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్, ప్రభుత్వం ఎన్నికైన కార్పొరేషన్ల మధ్య అధికారాల పంపిణీకి సంబంధించి స్పష్టమైన సమీక్ష అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా 70 ఏండ్ల పాత చట్టాన్ని మార్చాలనే ప్రభుత్వ సంకల్పం మంచిదే అయినా.. ప్రజాస్వామ్య వికేంద్రీకరణను విస్మరించి, బ్యూరోక్రసీ (అధికార యంత్రాంగం) చేతికి సర్వాధికారాలు కట్టబెట్టేలా ఈ ముసాయిదా ఉండటం ఆందోళనకరం. ప్రజలపై పన్నుల భారం పడకుండా, స్థానిక సంస్థల హకులు కాలరాయకుండా ముసాయిదాలో సమూల మార్పులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డాక్టర్ దొంతి నరసింహరెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.