సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పనిమంతుడు పందిరేస్తే.. కుక్కతోక తగిలి కూలినట్లుగా తయారైంది రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థ పరిస్థితి. సరికొత్త సాంకేతికత, పకడ్బందీ సేవలు అందిస్తామంటూ గొప్ప లు చెప్పుకున్న కాంగ్రెస్ సర్కా ర్.. తీరా క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఉన్న వ్యవస్థను కాస్తా పూర్తిగా నిర్వీర్యం చేసి ఐదురోజులుగా చేతులెత్తివేసింది. మెయింటెనెన్స్, అప్‌గ్రేడేషన్ పూర్తిచేశామని ప్రకటించిన మూడు రోజులకే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు ఘోరంగా మొరాయించాయి.
గత ఐదు రోజులుగా తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ పూర్తిగా స్తంభించడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఒక్క గంటపాటు వెబ్సైట్, సర్వర్లు మొరాయిస్తేనే రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంటుంది. గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. అలాంటిది వరుసగా ఐదు రోజులుగా వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురౌవుతున్నారు.
వెబ్సైట్, సర్వర్ డౌన్ కావడంతో లావాదేవీలన్నీ నిలిచిపోవడంతో తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా, ఆఫిడవిట్లు, అగ్రిమెంట్లు, కోర్టు వ్యవహారాలు ప్రభావితమయ్యాయి. కనీసం బుక్ చేసకున్న స్లాట్ల రిజిస్ట్రేషన్ చేసే వీల్లేకుండా పోవడంతో కార్యాలయాల వద్ద జనాలు బారులు తీరాల్సిన పరిస్థితి వచ్చింది.
సర్వర్లను ఇటీవలే ఆధునీకరించినట్లుగా చెప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం… సేవలను అందించడంలో ఐదు రోజులుగా విఫలైమంది. అనాలోచిత నిర్ణయాలు, సాంకేతిక లోపాలతో దరఖాస్తుదారులను ఇబ్బందికి గురిచేస్తున్నారంటూ పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోయారు. ప్రభుత్వ ఖజానాకు కూడా రోజువారీగా కోట్ల రూపాయల నష్టం వస్తున్నా… రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే రాబడి నిలిచిపోతున్నా… సైట్ పునరుద్ధరణ కోసం యంత్రాంగం నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు ఉన్నాయి. అయితే సర్వర్లను ఆధునీకరించిన తర్వాత ఎందుకు మొరాయించాయనే అంశంలోనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో కూడా ఇలాగే జరిగినా.. అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో జనాలకు ఇబ్బందులు తప్పలేదు. రిజిస్ట్రేషన్ ఉందని విదేశాలకు వెళ్లాల్సిన కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకుంటే ఐదు రోజులుగా ఇవే ఇబ్బందులు ఉన్నాయని విద్యానగర్‌కు చెందిన ఓ ఎన్ఆర్ఐ మహిళ వాపోయింది. అత్యవసర సేవగా పరిగణించాల్సిన రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ఇలా గాల్లో వదిలేయడం సరికాదని, ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మత్తు వదిలి, ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వెబ్సైట్ అందుబాటులోకి తీసుకురావాలని, కనీసం బుధవారం నుంచైన యధావిథిగా రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.