Telangana | సైదాబాద్, ఫిబ్రవరి 28 : దేశంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో తెలంగాణ జైళ్ల శాఖ ముందుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డైరెక్టర్ వివి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం చంచల్గూడ జైళ్ల శాఖ ఆవరణలోని ఆడిటోరియంలో జరిగిన జైళ్ల శాఖ సిబ్బందికి ఆధునిక ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
జ్యుడిషియల్, జైలు, పోలీసు, ఫోరెన్సిక్ శాఖలు సమన్వయంతో పని చేయడం ద్వారా నేరాలను అదుపు చేయడంతో పాటు వాటిని నివారించడానికి బోధపడుతుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవాత్మక మార్పులు జైళ్ల శాఖలో వచ్చాయన్నారు. దేశంలో ఐదు రాష్ట్రాల్లోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న దక్షిణాది రాష్ట్రాలతో పాటు గుజరాత్ రాష్ట్ర జైళ్ళు ఉన్నాయని, ఈ రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల జైళ్ళకు ఆదర్శంగా నిలిచాయని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. జైళ్ల శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జైళ్లలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరికరాలను అందజేస్తున్నామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీలు శ్రీనివాస్,రాజేష్, డిఐజీ సంపత్ సంపత్, జైళ్ల శాఖ అధికారులు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.