సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు వివిధ ప్రాంతాల్లో పనిచేసి 25 ఏండ్లు సిల్వర్ జూబ్లీగా జరుపుకొంటారు. కానీ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఓ అధికారి మాత్రం ఒకేచోట 25 ఏండ్లుగా పాగా వేసి.. సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంటున్నారు. పదవీ విరమణ కూడా అక్కడే చేయాలని పట్టదలతో ఉన్నాడు. సాధారణంగా అధికారులకు మూడు నుంచి ఐదేండ్లు.. పనితీరు బాగుంటే మరో ఐదేండ్లు కలుపుకొని పదేండ్లకు స్థానచలనం కల్పిస్తారు. కానీ పీసీబీలోని ఆ అధికారిని25 ఏండ్లయినా హెడ్ ఆఫీస్ నుంచి కదిలించడం లేదు. ఆయనకే ఎందుకంత స్పెషల్ అనేది ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతున్నది.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయంలో సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్‌గా ఉన్న ఆ అధికారి 25 ఏండ్ల కిందట ఇక్కడికి వచ్చారు. తొలుత అనలిస్ట్ గ్రేడ్ హోదాలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో నియమితులయ్యారు. ముందుగా కర్నూలులో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత అసిస్టెటెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు హోదాలో 2001లో హైదారాబాద్‌లోని హెడ్ ఆఫీసుకు బదిలీపై వచ్చినట్లు తెలుస్తున్నది. అప్పటి నుంచి ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు నుంచి సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్‌గా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇలా సింగిల్ సెంటర్లో విజయవంతంగా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్నారు.
ఆయనతో పాటు హెడ్ ఆఫీస్‌కు వచ్చిన వారంతా వివిధ ప్రాంతాలకు బదిలీ అయినా సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు మాత్రం అక్కడే పాగా వేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అందరికీ పకడ్బందీగా అమలు చేస్తుంటే ఆ ఎస్ఈఎస్కు మాత్రం వర్తించడం లేదు. బదిలీలు ఉండవు కానీ ఆయనకు టంచనుగా పదోన్నతులు వస్తాయి. అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయి. కానీ బదిలీలో మాత్రం మినహాయింపు ఉంటుంది. అధికారులందరికీ రూల్స్ వర్తిస్తుంటే ఆ 25 ఇయర్స్ ఇండస్ట్రీ ఎస్ఈఎస్ అధికారికి మాత్రం సెపరేట్ రూల్స్ ఉంటాయి. ఉన్నతాధికారుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఇక్కడే తిష్టవేసి ఉన్నారని పర్యావరణవేత్తలు, సామాజికవేత్తల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
ఏ స్థాయి ఉద్యోగైనా ఆయన మాటను కాదనలేని పరిస్థితి ఏర్పడిందనే టాక్ బలంగా వినిపిస్తున్నది. ఇందులో భాగంగానే సీనియారిటీ గొడవలు సైతం కార్యాలయంలో బలంగానే జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఖాళీ అయిన జేసీఈఎస్ స్థానంలో వరంగల్ ఎస్ఈఎస్కు పూర్తి అదనపు బాధ్యతలిస్తూ ఇక్కడికి డిప్యూటేషన్‌పై పంపారు. ఆయనకు మరో పదేండ్లకు పైగా సర్వీస్ ఉన్నట్లు సమాచారం. పదేండ్లు ఆయన ఇక్కడే తిష్ట వేస్తే సీనియారిటీ ఉన్న తాము ఉన్నత పదవులు అనుభవించొద్దా? అనే ఆగ్రహంతో సదరు అధికారి ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆయన పదవీ విరమణ కూడా కేంద్ర కార్యాలయంలోనే చేసేటట్లు ఉన్నారనే టాక్ జోరుగా నడుస్తున్నది.
ఆ సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టును ఇప్పుడున్న హోదా ప్రకారం బదిలీ చేసే అవకాశం ఉన్నా ఆయనను కదిలించడం లేదు. పనితీరు బాగుంటుందని, ఎన్‌క్యాప్ నోడల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తున్నారని, అందుకే ఆయనను బదిలీ చేయడం లేదనే సాకులతో కొనసాగిస్తున్నారు. సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ పోస్టు ఆర్సీపురం జోనల్ కార్యాలయంలో ఖాళీగా ఉంది.
అక్కడి సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు పోస్టులో ఓ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టుకు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చి కొనసాగిస్తున్నారు. ఆ స్థానానికి హెడ్ ఆఫీస్‌లోని ఎస్ఈఎస్ను పంపించడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అదేవిధంగా వరంగల్ కార్యాలయంలోని ఎస్ఈఎస్కు హెడ్ ఆఫీస్‌లోని జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు పోస్టు ఖాళీ కావడం వల్ల ఆ స్థానానికి పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చి ఇక్కడికి పిలిపించారు. సీనియారిటీ ప్రకారం వరంగల్ నుంచి వచ్చిన అధికారికి జేసీఈఎస్గా పదోన్నతి కల్పించి ఇక్కడ తిష్ట వేసిన సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్‌ను అక్కడికి బదిలీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మొత్తంగా ఆర్సీపురం, వరంగల్ కార్యాలయాలకు పంపేందుకు అన్ని అవకాశాలున్నా ఆయనను ఇక్కడే కొనసాగిస్తున్నారు. ప్రతి 3-5 ఏండ్లలోగా అధికారులను బదిలీ చేయాల్సి ఉన్నా సదరు అధికారిని 25 ఏండ్లుగా ఒక్క దగ్గరే కొనసాగించడంలో మర్మమేంటనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆ అధికారి అన్ని విభాగాల్లోని అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు సైతం గుప్పుమంటున్నాయి. ఏ అధికారైనా తాను చెప్పినట్లే వినాలనే తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు అంతర్గతంగా వెల్లువెత్తుతున్నాయి.