దుండిగల్, ఫిబ్రవరి 16 : సొంత పార్టీ అధ్యక్షుడిపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టలేని సన్యాసి రేవంత్‌రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తాలో గాడిదపై రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించారు. అనంతరం పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి సరైంది కాదని ఖండించారన్నారు. ఏ పార్టీ అని కాదు.. మనిషి హోదాను బట్టి సీఎం కేసీఆర్ తన రాజకీయ కర్తవ్యాన్ని నిలబెట్టుకున్నారని తెలిపారు. అలాంటి గొప్ప మహనీయుడిని దరిద్రుడైన రేవంత్‌రెడ్డి విమర్శించడం చేతకాని తననానికి నిదర్శనమన్నారు. యావత్ తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటే.. అది చూసి ఓర్వలేక ఓ కుక్క బజారులో మోరుగుతుందని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇలాంటి కుక్కలను రాబోయే రోజుల్లో ప్రజలు తరిమికొట్టక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
సంస్కారాన్ని మర్చిపోయి వ్యాఖ్యలు
సొంతపార్టీ నేతను ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే గాంధీభవన్‌లో ముసుగువేసుకుని పడుకున్న టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అందరికంటే ముందుగా బీజేపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన సీఎం కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలడం సిగ్గుచేటని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దహనం చేశారు. బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆస్పత్రి చౌరస్తావద్ద భారీ ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా మార్చిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పండుగలా జరుపుకోవాలని తామందరం నిర్ణయించుకున్నామని, ఎన్నిరోజులు నిర్ణయించుకోవాలని చెప్పడానికి రేవంత్‌రెడ్డి.. ఎవడని ప్రశ్నించారు. సంస్కారాన్ని మర్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న రామ్మూర్తి, కార్పొరేటర్లు వనం సంగీతాయాదవ్, కవితారెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రాములు చౌహాన్, షేక్ అహ్మద్, అరుణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.