రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ ప్రగతి అడుగడుగునా ప్రతిబింబించేలా 21 రోజుల పాటు ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నగరంలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం కావాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. అలాగే మేడ్చల్ కలెక్టరేట్లో మంత్రి మల్లారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అధికారులు సమన్వయంతో ముందుకెళ్లి.. వేడుకలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని, రాష్ట్ర ప్రగతి చాటేలా.. గడపగడపకు దశాబ్ది ఉత్సవాలను తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను హైదరాబాద్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసాని ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఈ విషయంపై ప్రత్యేకంగా సమావేశమై ఉత్సవాలు నిర్వహించే ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాల వారీగా కార్యక్రమాన్ని రూపొందించాలని మంత్రి తలసాని అధికారులకు సూచించారు. జూన్ 2వ తేదీన సీఎం కేసీఆర్ గన్ పార్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం సచివాలయంలో పతాకాన్ని ఆవిషరించి వేడుకలను ప్రారంభిస్తారని వివరించారు.
ప్రజలకు చేరువయ్యేలా..
అన్ని శాఖల్లో జరిగిన అభివృద్ధిపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ రన్లో పోలీసు, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది, క్రీడాకారులు, యువతీ యువకులు పాల్గొనే విధంగా చూడాలన్నారు. మన బస్తీ మన బడి కార్యక్రమం కింద అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో పనులను వేగవంతం చేసి నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు పాఠశాలలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా దేవాలయాలు, చర్చిలు, మసీద్ లు, గురుద్వార్ ఇతర ప్రార్ధనా మందిరాలను అలంకరించి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి తలసాని తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నాగేశ్, అయాచితం శ్రీధర్, విప్లవ్ కుమార్, మన్నె క్రిశాంక్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, జలమండలి ఎండీ దాన కిశోర్, సోషల్ వెల్ఫేర్ కమిషనర్ రాహుల్ బొజ్జా, సూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, కలెక్టర్ అమోయ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా రాష్ర్టావతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలని కార్మికశాఖ మంత్రి మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేడుకల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, బేతి సుభాష్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ ఉత్సవాన్ని పండగ వాతావరణంలో రోజుకు ఒక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు ముందు పదేళ్ల తర్వాత సాధించిన ప్రగతి, అభివృద్ధికి సంబంధించిన ఫొటోలతో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రతి నిత్యం ఆయా కార్యక్రమాలను పల్లెలు, పట్టణాల్లో ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
దేశంలోనే నంబర్ వన్..
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్‌వన్ స్థానంలో ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయన్నారు. 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేశ్, రైతు సంఘం అధ్యక్షుడు నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
గడప గడపకు దశాబ్ది ఉత్సవాలు
రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా 20 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని, గడప గడపకు దశాబ్ది ఉత్సవాలను తీసుకెళ్లేలా సమన్వయంతో ముందుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రం సాధించిన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ 9 ఏళ్ల హయాంలో అన్ని రంగాల్లో అద్వితీయ అభివృద్ధి జరిగిందని, సాధించిన ప్రగతిని గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసేలా గ్రామగ్రామాన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతుబందు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రుణమాఫీ, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, పల్లెప్రగతిలో భాగంగా ఆయా గ్రామాలకు వచ్చిన నిధులు, ఏయే పనులు చేశారనే వివరాలను గ్రామాల వారీగా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పాలమూరుతో జిల్లాకు తాగు, సాగు నీరు..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తి చేసి తాగు, సాగు నీరందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయరన్నారు. అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్నది ఎవరనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. అదేవిధంగా వికారాబాద్ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకుగాను జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగు అమరుల త్యాగాలకు గుర్తుగా జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మెన్ విజయ్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.