GHMC | జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. 24 గంటల్లోగా ఆ వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత రెండు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించాలని సూచించింది.
లంగర్‌హౌజ్, శాలిబండ డివిజన్ల పునర్విభజన సరిగ్గా జరగలేదంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ఇవాళ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, ప్రభాకర్ వాదనలు వినిపించారు. కాగా, పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదిస్తూ.. డీలిమిటేషన్ మ్యాప్‌ను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పునర్విభజనపై సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపారు. జనాభా, సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా పునర్విభజన మ్యాప్‌ను హైకోర్టుకు సమర్పించామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తెలిపారు. నియోజకవర్గం మారకుండానే వార్డుల విభజన జరిగిందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఏజీపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది. డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఏజీ.. డీలిమిటేషన్‌పై కోర్టు జోక్యం ఉండకూడదని తెలిపారు. కాగా, డీలిమిటేషన్ ప్రక్రియలో అనుమానాలు ఉన్నప్పుడు జ్యుడీషియల్ రివ్యూ చేయవచ్చని పిటిషనర్ల తరఫు లాయర్ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో జనాభా, మ్యాప్ వివరాలను అధికారిక వెబ్సైట్లో 24 గంటల్లోపు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.