సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో మూడు నాలుగు రోజులుగా నగరంలో దంచికొట్టిన వాన గురువారం తగ్గుముఖం పట్టింది. అక్కడక్కడ చిరు జల్లులు మినహా రాత్రి 9 గంటల వరకు ఎక్కడ కూడా చెప్పుకోదగిన వర్షపాతం నమోదు కాలేదు.
అయితే అల్పపీడనం కొనసాగడానికి తోడు రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.