Medicine | సిటీబ్యూరో: ఉస్మానియా, గాంధీ దవాఖానలు…ఈ పేర్లు హైదరాబాద్‌కే కాకుండా రెండు తెలుగు రాష్ర్టాలకు ఒక ఐకాన్. ఇక్కడ నగరవాసులు, తెలంగాణ వాసులే కాదు…దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన రోగులు కూడా పెద్ద సంఖ్యలో చికిత్స పొందుతుంటారు. అంతే కాకుండా ఉస్మానియా, గాంధీలో వైద్య విద్యనభ్యసించడం ఒక బ్రాండ్ ఇమేజ్‌గా పరిగణిస్తారు. ఇక్కడ వైద్య విద్యనభ్యసించిన ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు నోరి దత్తాత్రేయ వంటి వారే కాకుండా.. ఎంతో మంది ప్రముఖ వైద్యులు ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు.
అందుకనే పేరున్న వైద్యనిపుణులు నేటికీ వారి పేరు, చదివిన డిగ్రీల పక్కన ఉస్మానియా లేదా గాంధీ అని గర్వంగా పెట్టుకుంటారు. కార్పొరేట్లో కూడా జరగని క్లిష్టమైన శస్త్రచికిత్సలు ఎన్నో ఆ రెండు దవాఖానల్లో జరుగుతుంటాయి. 2016లో జరిగిన స్వీయ కాలేయ మార్పిడి శస్త్రచికిత్సనే ఇందుకు నిదర్శనం. ఇది అప్పట్లో ప్రపంచంలోనే రెండో ఆపరేషన్.
దేశంలో మొదటిది. ఇలా చెప్పుకుంటూ పోతే గాంధీ, ఉస్మానియా దవాఖానలు ఎంతో మంది నిరుపేద రోగులకు పునర్జన్మను ప్రసాదించాయి. ఇంతటి పేరు, ప్రఖ్యాతలు ఉన్న ఈ దవాఖానలు, వైద్యకళాశాలలకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లను నియమించడంపై ఆటు రోగులు, ఇటు వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉస్మానియాలో 8 మంది ప్రొఫెసర్లు, 23 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 111 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 33 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు ఈనెల 6న ప్రభుత్వం నోటిఫికేసన్ విడుదల చేసింది. గాంధీలో ముగ్గురు ప్రొఫెసర్లు, 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 29 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, నలుగురు ట్యూటర్లను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. శుక్రవారం దరఖాస్తు చేస్తున్న వైద్యులకు ఇంటర్వ్యూలు ప్రారంభించారు.
ఉస్మానియా, గాంధీల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన వైద్యులను పెద్దగా రోగులు లేని దవాఖానలు, వైద్య కళాశాలలకు బదిలీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో ఓపీ, ఐపీ రోగులు చికిత్స పొందే ఈ దవాఖానల్లో అనుభవజ్ఞులైన డాక్టర్లను బదిలీలపై పంపించి.. కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యులను నియమిస్తున్నారు. వైద్యసిబ్బంది సంఖ్య పెంచడం సబబే అయినా.. కీలకమైన పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించడంపై విమర్శలొస్తున్నాయి.