హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోరైల్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్అండ్టీ ఎంఆర్‌హెచ్ ప్రతినిధులు బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమై లార్సన్ అండ్ టుబ్రో లిమిటెడ్, ఎల్అండ్టీ మెట్రో హైదరాబాద్ లిమిటెడ్ సంస్థలతో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీనిపై హెచ్ఎంఆర్ఎల్ తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్అండ్టీ లిమిటెడ్ తరఫున డీకే సేన్, ఎల్అండ్టీ ఎంఆర్హెచ్ఎల్ తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌కు ఉన్న 100% షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఎల్అండ్టీ ఎంఆర్హెచ్ఎల్పై ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వ హామీతో 2026 ఏప్రిల్ 30 నాటికి రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ఐడీబీఐ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను సరఫ్ అండ్ పార్ట్నర్ సంస్థ అందించింది.
హైదరాబాద్‌లో ఎల్అండ్టీ మెట్రోరైల్ లిమిటెడ్ సంస్థ 2017 నవంబర్ నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కిలోమీటర్ల నెట్వర్తో మెట్రోరైల్ ఫేజ్-1ను నిర్వహిస్తున్నది. ఇందులో ప్రస్తుతం రోజుకు దాదాపు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రోరైల్ ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రతిపాదిత ఫేజ్-2 నెట్వర్ రూప కల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల అందజేతలో సమన్వయం సాధ్యమవుతుంది. తద్వారా ప్రయాణికులకు మరింత అనుకూలమైన మెట్రోరైల్ నెట్వర్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
హైదరాబాద్ మెట్రోరైల్ వ్యవస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందు ఎల్అండ్టీ చైర్మన్, ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి.