హైదరాబాద్ సిగలో మెరుపు తీగలాంటి మెట్రో రైలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీరని ఆర్థిక సమస్యగా మారబోతుందా? మే ఒకటి నుంచి మెట్రోను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియ కొలిక్కి రావడంతో సంతోషించాలో.. లేక దాని వెంట వచ్చే వేల కోట్ల అప్పుల భారాన్ని చూసి ఆందోళన చెందాలో అర్థం కానీ పరిస్థితి ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు భాగస్వామి చేతులెత్తిసిన తరుణంలో, ఆ భారమంతా ఇప్పుడు రాష్ట్ర ఖజానాపై పడనున్నది. మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన రూ. 13538.53 కోట్లు అప్పు, ఎల్ అండ్ టీ నుంచి బదిలీ చేసుకోవాల్సిన 100శాతం ఈక్విటీ వాటా విలువ రూ. 1461.47 కోట్లతో బదిలీ చేసుకున్న సర్కార్.. మే ఒకటి నుంచి రుణ బంధంతో మెట్రో సవారీని మొదలుపెట్టనున్నది. అప్పులపై వడ్డీల భారం ఓ వైపు, నిర్వహణ భారం మరోవైపు మోసుకొచ్చిన ఎల్అండ్టీ భారాన్ని సర్కార్ నెత్తిన వేసుకున్నది. ఇకపై ఈ భారాన్ని మోసే ప్రభుత్వం మే 1 నుంచి ఈ అప్పుల చెల్లింపు బాధ్యత, వడ్డీల భారం నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి చేరనున్నది. వడ్డీల సెగ ఏటా చెల్లించాల్సిన వడ్డీలే వందల కోట్లలో ఉండటంతో, అది రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నది. నష్టాల భర్తీ ప్రస్తుతం మెట్రో ఆపరేషనల్ నష్టాల్లో ఉంది. ఈ లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకాల నిధులను మళ్లిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
– సిటీబ్యూరో
ఇప్పటికే అప్పుల పరిమితిపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో మెట్రో బాధ్యతను నెత్తిన వేసుకోవడం గోరు చుట్టుపై రోకలి పోటు లాంటిదేనని విశ్లేషకులు అంటున్నారు. నిర్వహణ వ్యయంలో కేవలం రైళ్లను నడపడమే కాకుండా,స్టేషన్ల నిర్వహణ, విద్యుత్ చార్జీలు, సిబ్బంది జీతభత్యాల కోసం ప్రతి నెల భారీ మొత్తంలో వెచ్చించాలి. ఆదాయం అంతంతే ఉన్న టికెట్ ధరల ద్వారా వచ్చే ఆదాయం నిర్వహణ వ్యయానికి కూడా సరిపోని పరిస్థితి ఉంది. కమర్షియల్ స్పేస్ లీజుల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో లేదు. రాష్ట్ర ఖజానాపై రుణ భారాన్ని మోపుతూ, మెట్రో బంధాన్ని మెడకు చుట్టుకున్నది.
ప్రైవేటు సంస్థ నష్టాలను తట్టుకోలేక తప్పుకొంటుంటే… ప్రభుత్వం ఎందుకు సాహసం చేస్తుందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. బాధ్యతల స్వీకరణ పేరిట భాగస్వామికి ఎగ్జిట్ రూట్ ఇచ్చిన సర్కార్.. అప్పుల కుప్పను ప్రజల నెత్తిన రుద్దమేడనని ప్రతిపక్షాలు, ఆర్థిక వేత్తలు విమర్శిస్తున్నారు. ఆర్థికంగా రాష్ర్టాన్ని కోలుకోలేకుండా చేస్తుందనే విమర్శలున్నాయి. మెట్రో అప్పులు తీర్చడానికి సామాన్యుడిపై అదనపు పన్నులు వేయరనే గ్యారంటీ ఏముందనేది నగరవాసి ఆందోళన చెందుతున్నారు. మే ఒకటి నుంచి మెట్రో సర్కారీ నియంత్రణలో తిరగనున్న నేపథ్యంలో, మెట్రో వ్యవస్థ లాభాల బాటలో నడుస్తుందా? లేక ఖజానాను ఖాళీ చేసే తెల్ల ఏనుగులా మారుతుందా? లేక ఆర్టీసీ తరహాలో ఆర్థిక భారంలో కూరుకుపోయేలా చేస్తుందా? అనేది తేలడానికి మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది.