భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధవాతావరణం నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ కొనసాగుతున్నది. సిటీలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. మతపరమైన ప్రదేశాలు, ప్రార్థన మందిరాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలీసు బలగాలతో పాటు ఇంటెలిజెంట్, స్పెషల్ బ్రాంచ్, డాగ్ స్కాడ్ తదితర విభాగాలు రంగంలోకి దిగాయి. సున్నిత మైన ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. 24/7 సీసీ కెమెరాలు పనిచేసేలా మానిటరింగ్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, గచ్చిబౌలి స్టేడియం, ఐటీ కారిడార్, హైటెక్ సిటీపై ప్రత్యేక నిఘా పెట్టారు.
సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. భారత్ పాక్ మధ్య పరిణామాల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక స్థావరాలు, సైనిక కంటోన్మెంట్లు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిఘా పెంచారు. సిటీలో మతపరమైన అల్లర్లు తలెత్తకుండా ముందస్తుగా గతంలో ఇటువంటి అల్లర్లను ప్రోత్సహించిన వారిని గుర్తించి వారిపై కన్నేశారు. పాతబస్తీ, కంటోన్మెంట్, సైదాబాద్, మలక్‌పేట వంటి ప్రాంతాల్లో పోలీసు భద్రత కొనసాగుతోంది.
సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నారు. నగరంలో సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో అనుకూలతను బట్టి ఆయాప్రాంతాల్లో స్థానికుల సహకారం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటివరకు పాకిస్థాన్ విషయంలో కొంత సానుకూలంగా స్పందించిన వారిని కూడా గుర్తించి వారిపై కూడా దృష్టిపెట్టినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో శాంతిభద్రతలు కాపాడడంతో పాటు యుద్ధవాతావరణం తలెత్తితే ప్రజ లు తమను తాము రక్షించుకోవడం, పోలీసుల చర్యలపై ఎప్పటికప్పుడు జోనల్ ఆఫీసర్లతో సీపీ సమీక్ష నిర్వహిస్తున్నారు.
ప్రార్థన మందిరాలపై ప్రత్యేక దృష్టి..
నగరంలోని ప్రార్థన మందిరాల వద్ద ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ముందస్తుగా అన్ని ప్రాంతాల పోలీసులను అలర్ట్ చేశారు. ముఖ్యంగా మతపరమైన ప్రదేశాల చుట్టూ నిఘా పెంచారు. స్థానిక, డివిజనల్, జోనల్ స్థాయిలోని నైట్ డ్యూటీ అధికారులు రాత్రివేళల్లో తమ ఏరియాల్లోని ముఖ్యమైన ప్రార్థన ఆలయాలను సందర్శించి తనిఖీలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.
ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే తొలగించాలని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తగా మతపరమైన స్థలానికి ఏదైనా నష్టం జరిగితే దానిని వెంటనే సరిదిద్ది అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ విషయంలో లోకల్ అధికారులే కీలక పాత్ర పోషించాలని, ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో టచ్‌లో ఉండాలని, ముఖ్యమైన సమాచారం ఉంటే క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని సీపీ వరకు ఎవరికైనా వెంటనే తెలిపేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గతంలో మతపరమైన అల్లర్లకు కారణమైనవారు కానీ, అందుకు ప్రేరేపించినవారు, అందులో పాల్గొన్నవారు ఎవరున్నా వారిపై నిఘా పెట్టినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. పోలీసులకు ప్రజలు సహకరించి వారి భాగస్వామ్యంతో ఎటువంటి పరిస్థితినైనా గట్టెక్కించగలమని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.