మెహిదీపట్నం, జూన్ 26 : చారిత్రాత్మక గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబికా ఎల్లమ్మకు గురువారం తొలి బోనం సమర్పణతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలుత లంగర్ హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీసీ సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనాల ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. లంగర్ హౌజ్ చౌరస్తా లోగోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించి, అమ్మవారికి తొలి బోనం అందించారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, లంగర్ హౌస్ నుంచి ప్రారంభమైన తొట్టెల ఊరేగింపు గో ల్కొండ చోట బజార్, బడా బజార్ మీదుగా కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు ఎంతో ఉత్సాహంగా జరిగింది. గో ల్కొండ కోటపై జరిగిన బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని అమ్మవారికి బోనాలను సమర్పించారు.
అలాగే ఎమ్మెల్సీ విజయశాంతి సైతం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. మరోవైపు కుమ్మరుల సంఘం 451 బోనాలను గోల్కొండ అమ్మవారికి సమర్పించారు. చైర్మన్ కాకులారం శంకర్, అధ్యక్షుడు విజయకుమార్ ప్రధాన కార్యదర్శి అనిల్, రామచందర్, ప్రకాశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.